బెదిరించి రూ.8.13 లక్షలు లాక్కొన్నారు..
ABN, First Publish Date - 2020-05-09T08:20:11+05:30
పేదల ఇళ్ల స్థలాలకు భూమిని అమ్మగా వచ్చిన సొమ్ము నుంచి రూ.8.13 లక్షల చెక్కును వైసీపీ నాయకులు
పెనుమదంలో భూ యజమాని ఆవేదన
పాలకొల్లు అర్బన్, మే 8 : పేదల ఇళ్ల స్థలాలకు భూమిని అమ్మగా వచ్చిన సొమ్ము నుంచి రూ.8.13 లక్షల చెక్కును వైసీపీ నాయకులు బల వంతంగా లాక్కొన్నారని భూ యజమాని వారణాసి బాపనమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోడూరు మండలం పెనుమదం గ్రామంలో తన తల్లి బాపనమ్మ పేరున ఎ.1.78 సెంట్ల పంట భూమి ఉంది. మీ భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని ఎకరం రూ. 35 లక్షలు వచ్చేలా చూస్తామని స్థానిక వైసీపీ నాయకుడు సొసైటీ పర్సన్ ఇన్‌చార్జి పెద్దిబోయిన బాబూరావు, సొసైటీ కార్యదర్శి నిట్టల భానుమూర్తి, వీఆర్‌వోలు గత ఫిబ్రవరిలో చెప్పి తమచేత ఓ అంగీకార పత్రం రాయించుకున్నారన్నారు. ఎకరం రూ. 35 లక్షలపైన ఎంత వచ్చినా తమకు ఇవ్వాలని పత్రంలో షరతు విధించినట్టు తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరులో మా తల్లి బాపనమ్మ పేరుతో పాలకొల్లు ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచిలో రూ. 70,43,430లు జమ కాగా రూ. 8.13 లక్షలు ఇవ్వాలని బలవంతంగా లాక్కొని సొసైటీ కార్యదర్శి భానుమూర్తి కుమారుడి పేరుతో ఉన్న అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా పంట కూడా తమకే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనిపై గురువారం ఎమ్మెల్యే రామానాయుడుతో కలిసి ఏలూరు వెళ్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు.
Updated Date - 2020-05-09T08:20:11+05:30 IST