మోదీకి చంద్రబాబు లేఖపై బెడిసికొట్టిన జీవీఎల్ అత్యుత్సాహం
ABN, First Publish Date - 2020-08-23T03:15:45+05:30
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం కలిగించేవిగా ఉన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వకల్తా పుచ్చుకున్నట్లుగా జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. జీవీఎల్ లాంటి వాళ్ల వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడిపోతోందని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరడిగారని ప్రభుత్వాన్ని జీవీఎల్ వెనకేసుకొచ్చినట్లు మాట్లాడారో తెలియడంలేదని ఆయన వాపోయారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌తో కేంద్రానికి సంబంధంలేదని జీవీఎల్ ప్రకటించడం సహజంగానే విమర్శలకు దారి తీసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైనప్పటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కమ్యూనికేషన్ శాఖ కేంద్రప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది కనుక కేంద్రానికి ఫిర్యాదు చేస్తారు. లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.
తాజా వివాదంలో శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిన అవసరమేమిటన్నది జీవీఎల్‌కు మాత్రమే తెలియాలి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారతీయ జనతా పార్టీ పెద్దల మనసులో ఏముందో తెలియదు గానీ నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వాళ్లను ముందుగా అదుపు చేయాలి. మా పార్టీ, మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం.
Updated Date - 2020-08-23T03:15:45+05:30 IST