ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటులో ఎండగడతాం
ABN, First Publish Date - 2020-09-14T08:22:39+05:30
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా ఎండగడతాం.
అమరావతిపై కేంద్రం వైఖరేంటో
తేల్చుకుంటాం: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా ఎండగడతాం. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట విరుద్ధమైన విధానాలను, సంపద సృష్టించకుండా వేలాది కోట్లు అప్పులు తెచ్చి, రాష్ర్టాన్ని అధోగతిపాలు చేస్తున్న తీరును కేంద్రం ద ృష్టికి తెస్తాం’’ అని టీడీపీ లోక్‌సభాపక్ష నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికి జీరో అవర్‌లో ఇచ్చిన అర్ధగంట సమయం సరిపోదని, సమయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఎంపీలాడ్స్ నిధుల విడుదల విధానాన్ని పునరుద్ధరించాలని కోరినట్లు తెలిపారు.
రాజధాని వివాదాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని, అమరావతి విషయంలో కేంద్ర వైఖరేంటో తేల్చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ఈ అంశాలన్నీ సభలో ప్రస్తావిస్తామని రామ్మోహన్ స్పష్టం చేశారు.
Updated Date - 2020-09-14T08:22:39+05:30 IST