స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహిద్దాం
ABN, First Publish Date - 2020-03-16T10:07:21+05:30
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అంతా కృషి చేయాలని
వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి 15 : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అంతా కృషి చేయాలని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ కోరారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో స్థానిక ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన సార్వత్రిక ఎన్నికలను అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామన్నారు.
స్థానిక ఎన్నికలు కూడా అదేతరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల పక్రియ ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు అందాయని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్యాలెట్ పేపర్లు భద్రంగా ఉంచాలన్నారు. సాధారణ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
పొరపాట్లు, రాగద్వేశాలకు అతీతంగా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో తమ సొంత నిర్ణయాలు పక్కన పెట్టి ఎన్నికల నియమావళిని అనుసరించాలన్నారు. ఎన్నికలు వాయిదా పడినా నియమావళి యథాతదంగా కొనసాగుతుందన్నారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఏవోబీ, జిల్లా సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 18000 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం, నగదు ప్రవాహాన్ని అరికట్టుందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమావేశంలో జేసీ కిశోర్‌కుమార్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పెట్టెలు మోయమంటున్నారు...
ఈ సమావేశంలో పోలీసులు పడుతున్న ఇబ్బందులపై గజపతినగరం సీఐ విద్యాసాగర్ ఏకరువు పెట్టారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం కూడా పెట్టలేదని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే చాలా చోట్ల పెట్టెలు మోయమంటూ రెవెన్యూ అధికారులు ఆదేశిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ హరిజవహార్‌లాల్ కలగుజేసుకుని ఇటువంటి సమస్య పునరావృత్తం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో అందరూ కలిసిమెలసి పోవాలని సూచించారు.
Updated Date - 2020-03-16T10:07:21+05:30 IST