‘కోట’రీ
ABN, First Publish Date - 2020-11-04T04:49:43+05:30
మహారాజా కళాశాల ప్రైవేటీకరణపై కోటలోనే కోటరీ నడుస్తోంది. విద్యా సంస్థల ప్రైవేటీకరణ నుంచి విలువైన భూముల అమ్మకాల వరకూ అక్కడే ప్రణాళిక తయారవుతోంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా మాన్సాస్ గతంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ పాలకవర్గానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి.
మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాలు ఇక్కడి నుంచే
భూముల అమ్మకాల నిర్ణయాలకూ అదే కేంద్రం
పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు
మహారాజా కళాశాల ప్రైవేటీకరణపై కోటలోనే కోటరీ నడుస్తోంది. విద్యా సంస్థల ప్రైవేటీకరణ నుంచి విలువైన భూముల అమ్మకాల వరకూ అక్కడే ప్రణాళిక తయారవుతోంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా మాన్సాస్ గతంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ పాలకవర్గానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి. కొత్తగా చైర్‌పర్సన్ వచ్చిన తర్వాత ఓ కోటరీ తయారైంది. అందులో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి అధికార.. అనధికార వ్యక్తులు సహకరిస్తున్నారు. ఈ వ్యవహారాలను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
మహారాజా అలక్‌నారాయణ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు 1958లో ఏర్పాటయ్యాక కొన్ని దశాబ్దాల పాటు సాఫీగా నడిచింది. విద్యా సంస్థల నిర్వహణకు కేటాయించిన 14 వేల ఎకరాలు ప్రభుత్వ పరం కాకుండా మాన్సాస్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. కళాశాలలను ట్రస్టు పరిధిలో చేర్చారు. అప్పటి నుంచి ట్రస్టు దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో కొనసాగుతూ వచ్చింది. ట్రస్టు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవదాయ శాఖ అధికారుల నిర్ణయాలే కీలకమయ్యేవి. ఇది కొన్ని సందర్భాల్లో పాలకవర్గాలకు నచ్చలేదు. 2001లో ట్రస్టు కరస్పాండెంట్‌గా కొండపల్లి అచ్యుతరావు ఉండేవారు. ఆ సమయంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా భ్రమరాంబ పనిచేశారు. మాన్సాస్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసుకున్న కరస్పాండెంట్ కంటే దేవదాయ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ అధికారి(ఈఓ)కి ఎక్కువ అధికారాలు ఉండాలంటూ ఆమె కోర్టుకు వెళ్లారు. దేవదాయ శాఖ వేసిన ఈ కేసులో ఆ శాఖకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. తరువాత 2005లో మరో పర్యాయం మాన్సాస్ మేనేజ్‌మెంట్ కోర్టుకు వెళ్లింది. ఆ కేసులో కూడా ఎండోమెంట్ అప్రూవల్ లేనిదే ఏదీ చెల్లుబాటు కాదని కోర్టు విశదీకరించింది. అప్పటి నుంచి 2015వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ట్రస్టు పరిధిలోని భూములు కూడా భద్రంగా ఉన్నాయి. ఆనంద్ గజపతి చైర్మన్‌గా ఉన్న కాలంలో కూడా భూములను విక్రయించకుండా ఎక్కువగా లీజుల రూపంలోనే స్థలాలను కేటాయించారు.
2016లో అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక... ఇదే అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న కారణంగా మాన్సాస్ చైర్మన్‌కు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. చైర్మన్ ఏర్పాటు చేసుకున్న కరస్పాండెంట్‌కే కీలక నిర్ణయాలు తీసుకోనే అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో అప్పటి నుంచి దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే 2018లో విశాఖ జిల్లాలోని భీమిలి ప్రాంతంలో విలువైన 200 ఎకరాలకు పైగా భూములను అమ్మేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ప్రజా సంక్షేమం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
మాన్సాస్ ఏర్పాటైన తరువాత ఇద్దరు కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనంద్ గజపతి హయంలో డీఆర్‌కే రాజు కరస్పాండెంట్‌గా పనిచేశారు. అశోక్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎంవీజీఆర్ ప్రిన్సిపాల్ కేవీఎల్ రాజును మాన్సాస్ కరస్పాండెంట్‌గా నియమించుకున్నారు. చైర్‌పర్సన్‌గా వచ్చిన సంచయిత గజపతిరాజు కూడా కేవీఎల్ రాజునే కరస్పాండెంట్‌గా కొనసాగిస్తున్నారు.
రెవెన్యూ శాఖలో మంచి పట్టున్న ఉద్యోగిని మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా తాజాగా సంచయిత నియమించారు. ఆయన విశాఖ జిల్లా పద్మనాభం మండలం తహసీల్దారుగా, అదే జిల్లాలో ఆర్డీవోగా పనిచేసి ఇపుడు మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటు యాజమాన్యం నుంచి ఏర్పాటు చేసుకున్న కరస్పాండెంట్, దేవదాయ శాఖ ద్వారా తమకు అనుకూలంగా ఉన్న ఈవోను నియమించుకుని.. మరికొందరు అధికార, అనధికార వ్యక్తులతో ’కోటలో కోటరీ’ ఏర్పడింది. వీరికి అనుకూలంగా కరస్పాండెంట్, అదే మాదిరి ఈవో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈవోకు రెవెన్యూలో పట్టున్న కారణంగా మాన్సాస్ పరిధిలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్యాక్రాంతమైన వాటిని తిరిగి మాన్సాస్ పరిధిలోకి ఎలా తీసుకు రావాలి? అమ్మకాలు ఎలా నిర్వహించాలి? తీసుకున్న నిర్ణయాలకు ఎటువంటి అడ్డంకులు రావచ్చు? అనేది ముందుగానే గుర్తించి కోటరీ ఆధ్వర్యంలో పావులు కదుపుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఇసుక అమ్మకాల వ్యవహారం నుంచి విశాఖ, అనకాపల్లితో పాటు వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న భూముల అమ్మకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నట్లు సమాచారం. మాన్సాస్ పరిధిలోని ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ అంశం కూడా కోటరీ నిర్ణయాల ప్రకారమే ముందుకు సాగుతోంది. దీనికి ప్రభుత్వంలోని పెద్దలు తెరవెనక సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Updated Date - 2020-11-04T04:49:43+05:30 IST