ఎందుకిలా?
ABN, First Publish Date - 2020-08-22T09:22:09+05:30
మాన్సాస్...పూసపాటి రాజవంశీయుల మానస పుత్రిక. విజయనగరం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మహరాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. రా
మాన్సాస్ ట్రస్ట్ పరిణామాలపై చర్చలు
జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు
గతంలో ఇటువంటి పరిస్థితి లేదంటున్న సిబ్బంది
చంద్రబాబు వ్యాఖ్యలతో స్పందించిన యంత్రాంగం
వేతనాల చెల్లింపునకు సిద్ధం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి):
మాన్సాస్...పూసపాటి రాజవంశీయుల మానస పుత్రిక. విజయనగరం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మహరాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. రాష్ట్రంలో అత్యుత్తమ ట్రస్ట్‌గా గుర్తింపు సాధించింది. సుదీర్ఘ చరిత్ర దీని సొంతం. పేదలకు విద్య అందించాలన్న లక్ష్యంతో ఏడు దశాబ్దాల కిందట మాన్సాస్ ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి లక్షలాది మంది విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించింది. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారు. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధినిస్తూ వస్తోంది. అటువంటి చరిత్ర కలిగిన మాన్సాస్ ట్రస్ట్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సిబ్బందికి జీతాలు అందించలేని స్థితిలోకి వెళ్లింది. వేతనాల కోసం వారు రోడ్డెక్కాల్సి వచ్చింది.
మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు తరువాత ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని పూర్వ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ పరిధిలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములున్నాయి. కోట్లాది రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో విద్యా సంస్థలు, కార్యాలయాల నిర్వాహణ... సిబ్బంది జీతాలు చెల్లించేవారు. విద్యాసంస్థల నిర్వహణలో ఎన్నడూ లోటు రాలేదు. కానీ గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలతో మాన్సాస్ ట్రస్ట్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది నిరసన
గత కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో వారంతా కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారు. తొలుత ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు అందించారు. కానీ జీతాలు చెల్లించలేదు. దీంతో నిరసన కార్యక్రమాలకు దిగారు. వినూత్న రీతిలో భిక్షాటన పేరుతో నిరసన తెలియజేశారు. దీంతో ఈ సమస్య బయటకు వచ్చింది. మాన్సాస్‌కు ఈ దుస్థితి ఏమిటన్న చర్చ ప్రారంభమైంది.
ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి నెట్టేయడంపై ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘62 ఏళ్ల ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 879 కుటుంబాలు రోడ్డెక్కడం గతంలో చూశామా? ఇప్పుడెందుకిలా ట్రస్టుకు అప్రదిష్ఠ తెచ్చారు? ఎంతో ఆర్థిక పరిపుష్టి ఉన్న సేవాసంస్థ ఇప్పుడిలా కావటానికి కారణం ఎవరు? సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా..? అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదు’’ అని ట్వీట్ చేశారు. అటు సిబ్బంది నిరసనలు, విపక్ష నేత ట్విట్‌తో యంత్రాంగంలో కదలిక వచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జీతాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
మాన్సాస్ కార్యాలయం కోటలో ఉంది. ప్రాథమిక విద్య నుంచి డీగ్రీ, పీజీ వరకూ. లా కళాశాల, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల..ఇలా 12 విద్యాసంస్థలు ఉన్నాయి. ఏటా సుమారుగా 12 వేల మంది విద్యార్థులు మాన్సాస్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. 577 మంది బోధన, 302 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ చదువకున్న వారు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు.
వారంతా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ దేవదాయ శాఖ పరిధిలో ఉంది. జీతాల వ్యవహారంపై సంబంధిత శాఖ ఏసీ జ్యోతి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తాజాగా రూ.3.10 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఆయా విద్యాసంస్థల కరస్పాండెంట్ల ద్వారా జీతాలు చెల్లిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
Updated Date - 2020-08-22T09:22:09+05:30 IST