ఆన్‌లైన్‌లో టెన్త్ హాల్ టికెట్‌లు
ABN, First Publish Date - 2020-03-16T06:45:17+05:30
పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్‌లు సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి జరగనున్న పరీక్షలకు హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో ఉంచింది.
పాఠశాల కోడ్‌తో డౌన్‌లోడ్ వెసులుబాటు
విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్‌లు సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి జరగనున్న పరీక్షలకు హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆదివారం నుంచి హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సంబంధిత పాఠశాల కోడ్‌తో ఆన్‌లైన్‌లోకి వెళ్లి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా విద్యార్థుల నామినల్ రోల్స్ కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. విద్యార్థుల వివరాలు, పరీక్షా కేంద్రం, హాల్‌టికెట్ నంబర్లు వంటివి నామినల్ రోల్స్‌లో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తప్పులుంటే సరిచేసుకునే వెసులుబాటు కల్పించారు.
అంటే విద్యార్థి లేదా అతని తండ్రి పేరు తప్పుగా ముద్రితమైనా, దివ్యాంగుడైతే వాటి వివరాలు లేకపోయినా వెంటనే డీఈవో కార్యాలయంలో తెలియజేయాలి. అందుకు నామినల్ రోల్స్ డౌన్‌లోడ్ చేసుకుని అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా? లేదా అని పరిశీలించుకోవాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఒకవేళ తప్పులు దొర్లితే వెంటనే తమ కార్యాలయానికి నివేదించాలన్నారు. ఈ నెల 31 నుంచి వచ్చేనెల 17 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 1026 పాఠశాలలకు చెందిన 56,759 రెగ్యులర్ విద్యార్థులు, 615 మంది ప్రైవేటు విద్యార్థులు 251 కేంద్రాల్లో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఇప్పటికే డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిప్యూటీ చీఫ్ సూపరింటెండెంట్‌ల నియామకం పూర్తి చేశామన్నారు. ఇన్విజిలేటర్ల ఎంపిక జరిగినా త్వరలో నియామకాలు చేపడతామని డీఈవో తెలిపారు.
Updated Date - 2020-03-16T06:45:17+05:30 IST