నిండుకుంటున్న సరకులు!
ABN, First Publish Date - 2020-03-27T09:40:34+05:30
దేశవ్యాప్తంగా వచ్చే నెల రెండో వారం వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడింది. రానున్న రోజుల్లో
నిత్యావసరాలకు కొరత
దుకాణాల్లో అయిపోయిన కందిపప్పు, వంట నూనె
స్వల్పంగా పెరిగిన పప్పులు, గోధుమపిండి ధరలు
ఇతర ప్రాంతాల నుంచి రవాణాకు ఇబ్బందులు
అవసరానికి మించి ప్రజలు కొనుగోళ్లు జరిపారంటున్న వర్తకులు
పోలీసులు ఆంక్షలు తొలగిస్తే సమస్య ఉండబోదని వెల్లడి
ఎటువంటి ఇబ్బందీ రానివ్వబోమంటున్న జాయింట్ కలెక్టర్
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
దేశవ్యాప్తంగా వచ్చే నెల రెండో వారం వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడింది. రానున్న రోజుల్లో సరుకులు లభిస్తాయో లేదోనన్న భయంతో ప్రజలు అవసరానికి మించి ముందుగానే కొనేస్తున్నారు. దీంతో విశాఖ నగరంతోపాటు జిల్లా అంతటా సరుకుల నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రైవేటు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో ఇతర ప్రాంతాల నుంచి సరుకుల దిగుమతి నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడి కొన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. ఇందుకు తాము కారణం కాదని టోకు వర్తకులు చెబుతున్నారు.
విశాఖపట్నం జిల్లా ప్రజలకు అవసరమైన బియ్యం శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వస్తుంటాయి. కందిపప్పు, మినప గుళ్లు, పెసరపప్పు, శనగపప్పు, వేరుశనగలు, వంటనూనెలు, గోధుమపిండి విజయవాడ నుంచి వస్తాయి. ప్రస్తుతం బియ్యానికి ఇబ్బంది లేదు. అవసరమైన మేర నిల్వలు ఉన్నాయి.
అయితే కందిపప్పు, మిననపప్పు, వంట నూనెలు, గోధుమపిండి తక్కువగా ఉన్నాయి. విజయవాడ నుంచి నగరానికి పప్పులు వస్తుంటాయి. విజయవాడలో గత నాలుగైదు రోజులుగా లాక్ డౌన్ ఆంక్షల వల్ల హమాలీలు రాకపోవడంతో సరుకుల లోడింగ్ నిలిచిపోయింది. దీంతో విశాఖకు పప్పులు దిగుమతి కావడంలేదు. స్థానికంగా పలు హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో పప్పుల నిల్వలు పూర్తిగా అయిపోవడం లేదా బాగా తగ్గిపోవడం జరిగింది. ఇదే అదనుగా భావించిన కొంతమంది వ్యాపారులు కందిపప్పుపై కిలోకు రూ.10, మినపగుళ్లపై 10 నుంచి 15 రూపాయలు పెంచేసి అమ్ముతున్నారు. వంట నూనెల డీలర్లు దుకాణాలు తెరవడం లేదు. బ్రాండెడ్ గోధుమపిండికి కొరత ఏర్పడడంతో లూజు పిండికి గిరాకీ వచ్చింది. 50 కిలోల గోఽధుమపిండి బస్తా రూ.1500 నుంచి రూ.1850కు పెంచారని రిటైల్ డీలర్ ఒకరు తెలిపారు.
బ్రాండెడ్ వంట నూనెల కొరత ఏర్పడడంతో లీటరు ప్యాకెట్‌పై ఐదు రూపాయలు పెరిగింది. విజయనగరం నుంచి కందిపప్పు దిగుమతి అవుతున్నా...అంత రుచి వుండదంటూ ఎక్కువమంది కొనుగోలుకు విముఖత చూపుతారని మరో వ్యాపారి చెప్పారు. నిత్యావసర సరుకుల కొరతకు విజయవాడ, హైదరాబాద్ నుంచి సరుకుల రవాణాకు ఆంక్షలు, హమాలీలు రాకపోవడం, విపత్తు తీవ్రత పెరిగే అవకాశం వుందని ఎక్కువమంది ప్రజలు రెండు నెలలకు సరిపడా సరుకులు కొనుగోలు చేయడం కారణాలుగా శ్రీనివాసరావు అనే రిటైల్ డీలర్ వివరించారు. సాధారణంగా ప్రతి కుటుంబం నెలకు సరిపడా సరకులు కొనుగోలు చేస్తుందని, ఇదంతా పదో తేదీలోపే జరిగిపోతుందని, కానీ లాక్‌డౌన్ వల్ల చాలామంది ఏప్రిల్, మే నెలలకు సరిపడా సరుకులను మార్చి నెలలో ఇప్పటికే కొనుగోలు చేశారని చెప్పారు.
సరుకుల కొరతకు ఇది కూడా ఒక కారణమని విశ్లేషించారు. రానున్న రోజుల్లో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడకుండా వుండాలంటే విశాఖకు రోజువారీ వచ్చే సరుకుల రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని, నగరంలో హోల్‌సేల్ డీలర్ల నుంచి రిటైలర్లకు సరుకుల రవాణాకు అనుమతి ఇవ్వాలని నాగేశ్వరరావు అనే మరో వ్యాపారి అభిప్రాయపడ్డారు.
నిత్యావసర సరుకులకు ఇబ్బంది రానివ్వం..ఎల్.శివశంకర్, జాయింట్ కలెక్టర్
విశాఖ నగరంతోపాటు జిల్లాలో ప్రజలకు సరిపడా నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా లారీలు నడవడానికి ప్రభుత్వం అనుమతి వచ్చింది. విజయవాడ నుంచి శుక్రవారంకల్లా సరుకులు వచ్చే అవకాశం ఉంది. నగరంలో హోల్‌సేల్ డీలర్ల ఇబ్బందులు పరిశీలించాం. అధిక ధరలకు సరుకులు అమ్మితే చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2020-03-27T09:40:34+05:30 IST