సజావుగా నీట్
ABN, First Publish Date - 2020-09-14T09:04:37+05:30
దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)-2020 సజావుగా ముగిసింది.
జిల్లాలో 35 కేంద్రాలు.... 11 వేల మంది హాజరు
రెండున్నర గంటల ముందు నుంచే అభ్యర్థుల రాక
కొవిడ్ నిబంధనలు అమలు
శానిటైజేషన్, థర్మల్ స్ర్కీనింగ్ తరువాతే అనుమతి
కొన్నిచోట్ల కానరాని ‘భౌతిక దూరం’
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)-2020 సజావుగా ముగిసింది. నగరంలో ఎటువంటి సంఘటనలు జరగకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో మొత్తం 35 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 13,200 మందికిగాను 11,000 మంది హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు స్లాట్ మేరకు కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించగా, ఉదయం 11:30 నుంచి స్లాట్‌లు కేటాయించారు. మధ్యాహ్నం 1:30 గంట వరకే కేంద్రాల్లోకి అనుమతించారు.
కరోనా కారణంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. తొలుత అభ్యర్థుల చేతులకు శానిటైజ్ చేసి తరువాత థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించారు. నిషేధిత వస్తువులు తీసుకురాకుండా మెటల్ డిటెక్టర్స్‌తో తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ప్రతి అభ్యర్థికి గ్లోవ్స్ అందజేశారు. అభ్యర్థులంతా మాస్క్‌లు ధరించి వచ్చారు. కాగా పలు కేంద్రాల వద్దకు విద్యార్థులతో వారి తల్లిదండ్రులు కూడా రావడంతో అధిక రద్దీ ఏర్పడి, భౌతిక దూరం పాటించలేదు. తనిఖీల అనంతరం పరీక్ష హాలులోకి వెళ్లేటప్పుడు కూడా కొన్ని కేంద్రాల్లో భౌతిక దూరం నిబంధనను విస్మరించారు. పరీక్ష ముగిసేవరకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆయా కేంద్రాల వెలుపల నిరీక్షించారు.
Updated Date - 2020-09-14T09:04:37+05:30 IST