ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదం అంచున నివాసం

ABN, First Publish Date - 2020-05-16T09:25:18+05:30

విశాఖపట్నం చుట్టూ ప్రమాదకరమైన పరిశ్రమలే ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందినవన్నీ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి నడుస్తున్నవే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు

జిల్లాలో 20 వరకూ గుర్తించిన ప్రభుత్వం

పేర్లు వెల్లడించని వైనం

అన్నింటా నిబంధనల ఉల్లంఘన

పట్టించుకోని ప్రభుత్వం

హెచ్‌పీసీఎల్‌లో నిత్యం ప్రమాద ఘంటికలు

ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): విశాఖపట్నం చుట్టూ ప్రమాదకరమైన పరిశ్రమలే ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందినవన్నీ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి నడుస్తున్నవే. పాలిమర్స్‌ అని లేదు...పెట్రోలియం కార్పొరేషన్‌ అని లేదు...అన్నింటిలోను నిబంధనల ఉల్లంఘనే. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ప్రభుత్వాలకు వాటిపై అమితమైన ప్రేమ. సామాజిక సేవ నిధులను ఉపయోగించుకోవచ్చునని ఆశ. వీటన్నింటికి అతీతంగా అధికారంలో వున్న వారికి స్వప్రయోజనాలు అనేకం.  అయితే, ప్రమాదమని తెలిసీ...వాటిని కట్టడి చేయడానికి అవకాశం వున్నా...పట్టించుకోకుండా వదిలేయడమే ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద తప్పు.


దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ భారతదేశంలో ఏదైనా చేయవచ్చుననే ధీమాతో వచ్చి...అనుకున్నట్టుగానే నాలుగు దశాబ్దాలుగా నిబంధనలు కాలరాస్తూ కాలుష్య పరిశ్రమను నడుపుతోంది. ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగినా ఆ సంస్థ ప్రతినిధులపై ఈగ కూడా వాలలేదు. బాధిత గ్రామాల ప్రజలే పోలీసు కేసుల్లో చిక్కుకున్నారు. అదీ ప్రభుత్వం తీరు. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన తరువాత ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలు ఎన్ని వున్నాయని ఆరా తీయగా...రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మొత్తం 86 ఉన్నాయని తేలింది. అందులో ఒక్క విశాఖ జిల్లాలోనే 20 పరిశ్రమలు వున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు  తేల్చారు. వాటి వివరాలు ప్రకటిస్తే...ప్రజలు మరింత ఆందోళన చెందుతారని వెల్లడించలేదు. అయినా ఇక్కడి ప్రజలకు వాటి గురించి బాగా తెలుసు. 


హెచ్‌పీసీఎల్‌లో నిత్యం ప్రమాద ఘంటికలు

జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమ హెచ్‌పీసీఎల్‌. ఇక్కడ ఎల్‌పీజీ గ్యాస్‌, క్రూడాయల్‌ నిల్వలు లక్షల టన్నుల్లో ఉంటాయి. ప్రమాదవశాత్తూ చిన్న నిప్పురవ్వ రేగితే...విశాఖ అల్లకల్లోలం అయిపోతుంది. 1997లో ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకులు పేలడంతో చుట్టుపక్కల ప్రజలు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నగరంలోకి, అటు పరవాడ వైపు పరుగులు తీశారు. పదుల సంఖ్యలోనే ప్రాణాలు పోయాయి. ఆ తరువాత కూడా ఈ సంస్థలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరిగినా ఆ సంస్థను అక్కడి నుంచి తరలించలేదు. పాలిమర్స్‌ లాగే ఆ సంస్థ విస్తరణకు కూడా అనుమతులు ఇచ్చారు. అక్కడేదైనా జరిగితే...సమీపంలోనే వున్న రామ్‌నగర్‌, మల్కాపురం, శ్రీహరిపురం ప్రజల ప్రాణాలకు ముప్పే.


కోరలు చాచిన కోరమండల్‌

కోరమండల్‌ కూడా పారిశ్రామిక ప్రాంతంలోనే ఉంది. రసాయన ఎరువులు తయారుచేస్తోంది. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్‌ను పెద్దమొత్తంలో నిల్వ చేస్తారు. ఈ సంస్థ ప్రహరీని ఆనుకుని రామ్‌నగర్‌, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ ఉన్నాయి. ఈ రసాయనాల ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.


సైలెంట్‌ కిల్లర్‌...విశాఖపట్నం పోర్టు

విశాఖపట్నం పోర్టు వల్ల విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందిందో...ఇక్కడి ప్రజలు అదేస్థాయిలో కాలుష్యం బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోర్టు పరిసరాల్లో వందల ఎకరాల్లో నిల్వ చేస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, బొగ్గు నుంచి ధూళి గాలికి పైకి లేచి...నగరంలోకి వచ్చి...ప్రజల ఊపిరితిత్తుల్లో చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోర్టును ఆనుకుని అనేక ఆవాసాలు ఉన్నాయి. అక్కడి ప్రజల్లో 20 నుంచి 30 శాతం మంది ఊపిరితిత్తుల వ్యాధులతోనే మరణిస్తున్నారు. నగర ప్రజలు సొరియాసిస్‌ వంటి సుదీర్ఘ చర్మ వ్యాధులతో జీవనం సాగిస్తున్నారు. దేశంలో ఏ పోర్టు దిగుమతి చేసుకోని ప్రమాదకర రసాయనాలు ఇక్కడ కనిపిస్తాయి. పాలిమర్స్‌లో ప్రమాదం సృష్టించిన స్టైరిన్‌ మోనోమోర్‌ పోర్టులోనూ భారీగా నిల్వ ఉంది. అలాగే అమ్మోనియం నైట్రేట్‌, బొగ్గు, సల్ఫర్‌...ఇలా అనేక రసాయనాలు లక్షల టన్నుల్లో ఇక్కడ నిల్వ చేస్తున్నారు. వాటి ప్రభావం...నగర ప్రజలపై పడదని చెప్పడం బుకాయింపే తప్ప మరేమీ కాదు.


ఫార్మా కంపెనీల్లో ఎప్పుడూ పేలుళ్లే!!

నగరం చుట్టుపక్కల, జిల్లాలో గల ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలుతుంటాయి. అందులో రసాయనాలు సిబ్బందిపై పడి ఊపిరాడక...ఆస్పత్రుల్లో చేరి చనిపోతుంటారు. ఇక పాలిమర్స్‌లాగే కొన్ని కంపెనీలు అనుమతులు లేకుండానే ఉత్పత్తులు చేయడం ఆనవాయితీ. ఎన్ని లోపాలు బయటపడ్డా....కమిటీలు వేయడమే తప్ప ఒక్క కంపెనీపై చర్య తీసుకున్న సందర్భాలు లేవు. అందుకే కొత్త కొత్త ఫార్మా కంపెనీలన్నీ విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. 


అక్కడ ప్రమాదాలతోనే సహవాసం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కార్మికులకు వాటితో సహవాసం చేయడం అలవాటైపోయింది. నిర్మాణ పనుల్లోనే కాంట్రాక్టు కార్మికులు తరచూ ప్రాణాలు కోల్పోతుంటారు. పరవాడలోని ఎన్‌టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద పిట్టవానిపాలేన్ని పూర్తిగా కలుషితం చేసింది.  

Updated Date - 2020-05-16T09:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising