భయం గుప్పిట గిరిజనం
ABN, First Publish Date - 2020-12-15T05:43:32+05:30
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టులు గిరిజనుడిని హతమార్చడంతో మారుమూల గ్రామాల్లో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
ఇన్‌ఫార్మర్ అనుమానంతో గిరిజనుడి హతం
హిట్‌లిస్టులో ఉన్న వారిలో గుబులు
సీలేరు, డిసెంబరు 14: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టులు గిరిజనుడిని హతమార్చడంతో మారుమూల గ్రామాల్లో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లికి చెందిన గెమ్మెలి కృష్ణారావును ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటనతో ఏవోబీలోని మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న వారిలో గుబులు మొదలైంది. ఏ క్షణంలో.. ఏమీ జరుగుతుందోనని భయపడుతున్నారు. ఏవోబీలో గత ఏడాదిగా మావోయిస్టులు ఇన్‌ఫార్మర్లను హతమార్చిన సంఘటనలకు పాల్పడలేదు. దీంతో మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న వారంతా ప్రశాంతంగా ఉన్నారు. 2019 జూన్ 28న పెదబయలు మండలం బొంగజంగికి చెందిన కొర్రా సత్తిబాబును పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఆ తర్వాత 2019 జూలై 17న చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన గెమ్మెలి భాస్కరరావు, పాంగి సత్తిబాబులను హతమార్చారు. పోలీసులతో ఎక్కువగా సంబంధాలు కొనసాగించేవారిని గుర్తించి, వారికి పద్ధతిని మార్చుకోమంటూ హెచ్చరిస్తుండేవారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టులు నెలకొల్పడంతో గిరిజనుల్లో మరింతగా ధైర్యం వచ్చింది. అయితే ఆదివారం రాత్రి వాకపల్లికి చెందిన కృష్ణారావును ఇన్‌ఫార్మర్ అనుమానంతో హతమార్చడం గిరిజనుల్లో మళ్లీ అలజడి నెలకొంది.
ఒడిశా పోలీస్ అధికారుల బృందం పర్యటన
ఏవోబీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా పోలీస్ ఉన్నతాధికారుల బృందం సోమవారం పర్యటించింది. ఆదివారం తెల్లవారుజామున మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ జాన్‌బాయ్ సమీపంలోని సింగారం అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఒడిశా ఇంటిలిజెన్సీ డైరెక్టర్ ఆర్‌కే శర్మ, ఐజీ అమితవ్ ఠాకూర్, డీజీ అభయ్, డీఐజీ అనిరుధ్‌సింగ్‌తో కూడిన బృందం జాన్‌బాయ్, గురుసేతు, జనతాబాయ్ ప్రాంతాల్లో పర్యటించింది. ఆదివారం సింగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆరా తీసింది. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు ఎటువైపు వెళ్లారనే విషయమై అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు అగ్ర నేతలు ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నారా అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కటాఫ్ ఏరియాల్లో గల బీఎస్‌ఎఫ్ అవుట్‌పోస్టులను సందర్శించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గిరిజనుల పట్ల స్నేహభావంతో మెలగాలని అవుట్‌పోస్టు సిబ్బందికి సూచించారు. బృందం వెంట మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిలారీ ఉన్నారు.
Updated Date - 2020-12-15T05:43:32+05:30 IST