28 నుంచి డిగ్రీ ఫైనల్ పరీక్షలు
ABN, First Publish Date - 2020-09-10T12:16:42+05:30
కరోనా కారణంగా వాయిదాపడిన పరీక్షలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల (ఫైనలియర్
- ఆరో సెమిస్టర్ షెడ్యూల్ విడుదల చేసిన ఏయూ
- వచ్చే నెల 9 వరకూ రెండు పూటలా నిర్వహణ
- ఉదయం ఆర్ట్స్, మధ్యాహ్నం సైన్స్ విద్యార్థులకు...
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా వాయిదాపడిన పరీక్షలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల (ఫైనలియర్ విద్యార్థులకు) నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం అనంతరం బుధవారం పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు రెండు పూటలా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆర్ట్స్ గ్రూపులైన బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సైన్స్ గ్రూపు బీఎస్సీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయూ అనుబంధంగా వున్న 220కుపైగా కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం రెండు జిల్లాల్లో 85 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి కేంద్రంలోను కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక గది ఏర్పాటుచేయనున్నారు. ఎడ్‌సెట్, లా సెట్ జరగనున్న అక్టోబరు ఒకటో తేదీన పరీక్షలు లేకుండా షెడ్యూల్‌ను రూపొందించారు.
మరోసారి అవకాశం
ఈ పరీక్షల నిర్వహణ సమయానికి ఎవరైనా విద్యార్థులు కరోనా వైరస్ బారినపడినట్టయితే వారు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వైరస్ బారినపడిన విద్యార్థులు పరీక్షలు రాయలేమన్న ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పరీక్షలు పూర్తయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
Updated Date - 2020-09-10T12:16:42+05:30 IST