ఏప్రిల్ 14 వరకు దళిత బహుజన హక్కుల సమర భేరి
ABN, First Publish Date - 2020-12-16T04:59:00+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విరుద్ధ పాలనా విధానాలకు వ్యతిరేకంగా 78 ప్రజా ఉద్యమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత బహుజన హక్కుల సమర భేరి ఏప్రిల్ 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు తెలిపారు.
బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు
సీతంపేట, డిసెంబరు 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విరుద్ధ పాలనా విధానాలకు వ్యతిరేకంగా 78 ప్రజా ఉద్యమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత బహుజన హక్కుల సమర భేరి ఏప్రిల్ 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు తెలిపారు. సమరభేరిలో భాగంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యారావు మాట్లాడుతూ అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ బద్ధమైన జవాబుదారీ పాలన కోసం దళిత బహుజనులు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ అణగారిన కులాల హక్కులను కాలరాస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగబద్ధమెన దళిత బహుజనుల అభివృద్ధి, సంక్షేమ సథకాలను నిర్వీర్యం చేసి, నిలిపివేసిందన్నారు. గడిచిన 18 నెలల పాలనలో 11 పథకాలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ హక్కులు, అవకాశాలను అందనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగించిందన్నారు. ప్రభుత్వాల విధానాల వల్ల ప్రస్తుతం రాష్ట్రం తిరోగమనంలో నడుస్తోందని, ప్రజలు నష్టపోతున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు, వ్యవసాయ రంగాలను దెబ్బతీసే విధంగా ఇటీవల కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్న నవరత్నాలు పథకాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం ప్రభుత్వం నిధులు కేటాయించి దళితుల సాధికారతకు ప్రత్యేక అభివృద్ధి పథకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దళితులపై కొనసాగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు వెంటనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర నిధు లతో ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటైన అభివృద్ధి పథకాలు ఎన్.ఎఫ్.ఎస్.డి.సి, ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి, ఎన్.ఎస్.టి.ఎఫ్.టి.సి రాష్ట్రంలో అమలు జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమ్మఒడి ద్వారా ఇచ్చే ప్రోత్సాహకాన్ని విద్యార్థి కేంద్రంగా స్కాలర్ షిప్ రూపంలోనే అందించాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఉన్నత విద్యలో పిహెచ్‌డి వరకూ విదేశీ విద్యకు సపోర్ట్ స్కాలర్‌షిప్ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గాధం మహేష్, దళిత ఫ్రంట్ రాష్ట్ర నాయకులు గంటా సురేష్, జైభీమ్ సేన అధ్యక్షులు కె.చిన్నారావు, రవి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:59:00+05:30 IST