కలుషితమై‘నది’... నీటిలో కలుస్తున్న చెత్తాచెదారం
ABN, First Publish Date - 2020-12-12T04:48:05+05:30
నర్సీపట్నం మునిసిపాలిటీలో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.
మునిసిపాలిటీలో ప్రశ్నార్థకంగా ప్రజారోగ్యం?
వరహా నదిని ఆనుకొని డంపింగ్ యార్డు ఏర్పాటు
ఏలూరు తరహా ఘటన జరగకముందే స్పందించాలని అంతా వేడుకోలు
నర్సీపట్నం, డిసెంబరు 11 : నర్సీపట్నం మునిసిపాలిటీలో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు ప్రధాన కార ణం వీరి తాగునీటి అవసరాలు తీర్చే వరహా నదిని ఆనుకొని చెత్తను డంపింగ్ చేస్తుండడమే. బలిఘట్టంలో గల వరహా నది సమీపంలో మూడేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో రూ.1.5 కోట్లతో మునిసిపాలిటీ కంపోస్ట్ యార్డు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తారు. దీని కోసం నది నీటి ప్రవాహం పక్కన చెత్త నిల్వ చేయడానికి డంపింగ్ యార్డు ఏర్పాటైంది. తాగునీటి అవసరాలు తీర్చే నది పక్కన డంపింగ్ యార్డు పెట్టడంపై అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం ఆలోచన చేయలేకపోయారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు పుర ప్రజల ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది.
భారీ వర్షాల సమయాల్లో నీటికి వ్యర్థాలు
భారీ వర్షాల సమయంలో చెత్తతో పాటు కుళ్లిన వ్యవర్థాలు నదిలో కలుస్తున్నాయి. అంతేకాకుండా చిన్న వర్షాలకు సైతం తడిసిన చెత్తలోంచి మురుగునీరు నదిలోకే వెళుతోంది. ఇటీవల భారీ వర్షాల సమయంలో డంపింగ్ యార్డులోని టన్నుల చెత్త మొత్తం వరహా నదిలోకి కొట్టుకుపోయిందని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని అంతా వాపోతున్నారు.
పుర ప్రజలకు ఆ నీరే గతి!
పూర్తి కాలుష్యంతో నిండిన నీటిని క్లోరినేషన్ చేసి ప్రతి రోజూ ప్రజల తాగు అవసరాలకు సరఫరా చేస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ఈ నీటితోనే గొంతు తడుపు కుంటు న్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒకరోజు ఏలూరు తరహా కాలుష్యాన్ని చవిచూడాల్సి వస్తుందని పట్టణ ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటక ముందే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని డంపింగ్ యార్డును తొలగించాలని కోరుతున్నారు. అంతే కాకుండా ప్రజలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతను పరీక్షించాలని వేడుకుంటున్నారు.
Updated Date - 2020-12-12T04:48:05+05:30 IST