‘విస్త’రించిన కరోనా కష్టాలు!
ABN, First Publish Date - 2020-11-14T04:46:32+05:30
కరోనా ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
పూట గడవని స్థితిలో ఆకులు కుట్టే మహిళలు
వైరస్ వ్యాప్తి కారణంగా తగ్గిన శుభకార్యాలు
విస్తరాకులకు భారీగా తగ్గిన డిమాండ్
చేతిలో చిల్లి గవ్వలేక మహిళలకు కష్టాలు
గొలుగొండ, నవంబరు 13 : కరోనా ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అందరినీ నష్టాల్లోకి నెట్టింది. విస్తరాకుల తయారీదారులను సైతం వీడలేదు. ఇదే వృత్తిగా జీవనోపాధి పొందుతున్న వేల కుటుంబాలకు చెందిన మహిళలు, డ్వాక్రా సంఘాల సభ్యులు నేడు దీనస్థితిలో ఉన్నారు.
ఈ వ్యాపారంలో గొలుగొండ మండలం ప్రసిద్ధి
జిల్లాలోని గొలుగొండ మండలం విస్తరాకుల తయారీకి ప్రసిద్ధి. శుభకార్యాల్లో విస్తరాకుల్లో భోజనాలు వడ్డిస్తే శుభసూచికంగా అంతా భావిస్తారు. దీంతో ఏ చిన్నపాటి కార్యక్రమమైనా వీటి కొనుగోలు తప్పని సరి. అయితే కరోనా వల్ల చాలా చోట్ల శుభకార్యాలు వాయిదా పడగా, జరుపుకున్న వారు సైతం కొద్దిమందితో తంతు ముగించేస్తున్నారు. ఫలితంగా విస్తరాకులకు గిరాకీ పూర్తిగా పడిపో యింది. సుమారు ఆరేడు నెలలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే అన్‌లాక్-5లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కొన్ని సడలిం పులు ఇచ్చి వివాహాది శుభకార్యాలను మరికొంత మంది బంధువులతో కలిసి జరుపుకోవచ్చునని పేర్కొన్నా.. వైరస్ వ్యాప్తి తగ్గని కారణంగా వేడులకు ఆ స్థాయిలో జనం హాజరు కావడం లేదు. దీంతో ఆయా వేడుకలు బోసిపోతున్నాయి. విస్తరాకుల విక్రయాలూపెరగడం లేదు. దీంతో వీటి తయారీనే నమ్ముకున్న కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారుతోంది.
ఏజెన్సీ సంతల నుంచి అడ్డాకులు కొనుగోలు
మండలంలోని గొలుగొండ, జోగంపేట, పప్పుశెట్టిపాలెం, కృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, కొంగశింగి, కొత్తమల్లంపేట, పాతమల్లంపేట, సాలికమల్లవరం గ్రామాలకు చెందిన మహిళలు ఏజన్సీలో వారపు సంతల నుంచి అడ్డాకులు కొనుగోలు చేస్తారు. వీటిని కొందరు తమ ఇంటి వద్ద విస్తరాకులుగా కుడుతుండగా, మరికొంత మంది వాహనాల్లో భారీగా ఆకులు కొని, కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి ఆకులు కుట్టిస్తుంటారు. వీరికి కుట్టిన ఆకుల బట్టి డబ్బులు చెల్లిస్తుంటారు.
రోజువారీ సంపాదనతో కుటుంబ పోషణ
మహిళలు తాము కుట్టిన ఆకులను విక్రయిస్తుంటారు. ఇలా రోజుకు సుమారు రూ.300 నుంచి రూ.400 వరకు సంపా దిస్తుంటారు. దీంతో ఆయా కుటుంబాల పోషణ కొంతవరకు సాఫీగా సాగేది. ఈ రంగంలో చాలా మంది డ్వాకా మహిళలు ఉండడంతో వారు బ్యాంకుల్లో తీసుకున్న రుణ వాయిదాలను సైతం ఈ డబ్బుల నుంచే చెల్లించేవారు. కానీ ప్రస్తుతం విస్తరాకులకు గిరాకీ లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ ఆడని పరిస్థితి నెలకొందని వారంతా వాపోతున్నారు. గతంలో ఏడాదంతా విస్తరాకులు కుట్టేవారమని, ఈ ఏడాది కరోనా తమను నిలువునా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Updated Date - 2020-11-14T04:46:32+05:30 IST