అతడికి 16 ఏళ్లు.. ఆమెకు 20 ఏళ్లు.. ఫ్రెండ్ బర్త్‌డేకు పిలిచాడని ఆమె వెళ్తే..
ABN, First Publish Date - 2020-10-03T16:10:27+05:30
పుట్టినరోజు వేడుకలకు హాజరై, తిరిగి వెళుతున్న సమయంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి, బాలుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర
ఆవిరైన ఆనందం.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో బాలుడు, యువతి దుర్మరణం
మృతులు ఫేస్‌బుక్ స్నేహితులు
విశాఖ, కొమ్మాది(ఆంధ్రజ్యోతి): పుట్టినరోజు వేడుకలకు హాజరై, తిరిగి వెళుతున్న సమయంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి, బాలుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు...జీవీఎంసీ ఐదో వార్డు వైఎస్‌ఆర్ నగర్‌లో వుంటున్న ప్రేమ్‌కుమార్ (16), నగరంలోని రామ్‌నగర్‌లో వుంటున్న యువతి జి.మధు (20)లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది.
అది క్రమంగా స్నేహంగా మారడంతో ప్రేమ్‌కుమార్ ఇంటికి ఆమె తరచూ వచ్చి వెళుతుండేది. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు పుట్టినరోజు వేడుకలకు రావాలని గురువారం మధును ప్రేమ్‌కుమార్ ఆహ్వానించాడు. దీంతో సాయంత్రమే అతడి ఇంటికి చేరిన మధును వేడుకలు పూర్తయిన తరువాత రాత్రి రెండున్నర గంటల సమయంలో రామ్‌నగర్‌లో దించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరాడు.వారు మధురవాడ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రేమ్‌కుమార్ తండ్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.
కాగా ప్రమాదంలో మృతిచెందిన మధు స్వగ్రామం చోడవరం అని, ఆమె తండ్రి ఎన్‌ఏడీ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడని, తల్లి ఖతర్‌కు వెళ్లిందని పోలీసులు తెలిపారు. మధు తన సోదరితో కలసి చిన్నచిన్న ఫంక్షన్లు, ఈవెంట్స్ చేస్తూ రామ్‌నగర్‌లో ఉంటోందన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం ఏర్పడడంతో ప్రేమ్‌కుమార్ ఇంటికి తరచూ వచ్చి వెళుతుండేదని వివరించారు. ప్రేమ్‌కుమార్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడని తెలిపారు.
Updated Date - 2020-10-03T16:10:27+05:30 IST