వైసీపీ సానుభూతిపరులకే టిడ్కో గృహాలు
ABN, First Publish Date - 2020-12-12T04:49:12+05:30
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ సానుభూతిపరులకు ఇచ్చేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని అనకాపల్లి పార్టమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.
పన్నుల పెంపు ప్రతిపాదన విరమించుకోండి
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద
అనకాపల్లి, డిసెంబరు 11: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ సానుభూతిపరులకు ఇచ్చేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని అనకాపల్లి పార్టమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ఇందుకు నిరసనగా పట్టణంలో పార్టీ శ్రేణులతో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో ఇళ్లను నిర్మించిందని, కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. టిడ్కో ఇళ్లను పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లూ ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పన్ను పెంచనని హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. పన్నుల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, పోలారపు త్రినాథ్, ఆళ్ల రామచంద్రరావు, సబ్బవరపు గణేశ్, దొడ్డి జగదీశ్, నానాజీ, బొడ్డేడ మురళి, గణపతి, దూలం ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:49:12+05:30 IST