1600 కార్డులకో వాహనం
ABN, First Publish Date - 2020-12-29T08:15:55+05:30
రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సరిపడా వాహనాలను మాత్రం ఏర్పాటు చేయలేదు.
- రేషన్ డోర్ డెలివరీలో రెండేసి గ్రామాలకొకటి
- 1.44 కోట్ల కార్డులకు 9,260 వాహనాలే
- వలంటీర్ల సాయంతో డ్రైవర్లే పంపిణీ
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సరిపడా వాహనాలను మాత్రం ఏర్పాటు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికో వాహనం చొప్పున కేటాయించి, సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా, రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక్కటే వాహనాన్ని కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.44కోట్ల రేషన్ కార్డులుండగా.. ప్రభుత్వం 9,260 వాహనాలను కొనుగోలు చేసింది. అంటే సగటున ఒక్కో వాహనానికి 1,560 కార్డులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1800 కార్డులకు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నారు. ఆ మేరకు కార్డులు ఉండేలా రెండు లేదా మూడు గ్రామాలను కలిపి ఒక వాహనంతో సరుకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కార్డులు పెంచడం వల్ల పట్టణ ప్రాంతాల్లో సంఖ్య కొంత తగ్గుతుంది. సగటున చూస్తే ఒక్కో వాహనం నెలకు 1,600 కార్డులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వలంటీర్ల సాయంతో వాహనాలు పొందిన లబ్ధిదారులే పంపిణీ బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే ఇలా రెండు మూడు గ్రామాలకు కలిపి వాహనంతో పంపిణీ అంటే సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఒక్కో డీలరు వారి పరిధిలోని ఐదారు వందల కార్డులకు సరుకులు పంపిణీ చేయడానికే ప్రభుత్వం పదిహేను రోజుల సమయం ఇస్తోంది. డీలర్లు సగటున పది రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తిచేస్తున్నారు. ఇప్పుడు దానికి మూడింతల కార్డులకు ఒకే వాహనం ద్వారా పదిహేను రోజుల్లో ఎలా పంపిణీ చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ రోజు సరుకులు తీసుకోవాలనేది ఇప్పటివరకూ కార్డులదారుల ఇష్టంపై ఆధారపడి ఉంది.
ఇకపై డోర్ డెలివరీ వాహనం వచ్చినప్పుడే సరుకులు తీసుకోవాలి. ఇవన్నీ ప్రజాపంపిణీ వ్యవస్థలో కొత్త తలనొప్పులు తెస్తాయేమోనని అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా జనవరి 1 నుంచి ప్రారంభించదలచిన డోర్ డెలివరీ విధానం వాయిదా పడింది. వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఈసారికి ప్రస్తుత విధానంలోనే డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. అయితే డోర్ డెలివరీ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Updated Date - 2020-12-29T08:15:55+05:30 IST