మొత్తంగా రద్దుచేయాలి!
ABN, First Publish Date - 2020-03-16T09:20:05+05:30
అరాచకాలు, బెదిరింపులతో.. ఉన్మాద ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల వ్యవహారం సాగిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ మొత్తం ప్రక్రియను రద్దుచేసి ఎన్నికలకు
- స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి
- కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాలి
- సీఆర్‌పీఎఫ్‌ను రప్పించాలి
- కరోనా గురించి ఈ సీఎంకేం తెలుసు?
- జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అరాచకాలు, బెదిరింపులతో.. ఉన్మాద ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల వ్యవహారం సాగిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ మొత్తం ప్రక్రియను రద్దుచేసి ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరగాలని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర పోలీసులు అన్‌ఫిట్ అని, వారు భయపడుతున్నారని.. సీఆర్‌పీఎఫ్ బలగాలను రప్పించాలని సూచించారు. ఈ అంశాలపై రాష్ట్రపతి, గవర్నర్‌ను కూడా కలిసి కోరతామని తెలిపారు. ‘స్థానిక ఎన్నికల్లో 23 శాతం ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ బెదిరింపులు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలనే ఒత్తిళ్లు, అధికారుల అక్రమాలతో జరిగినవే.కడపలో ఏకంగా 70 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినందుకు ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలు ప్రహసనం అంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలు మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని అడుగుతున్నాయి’ అని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు జరగకపోతే నిధులు రావని ముఖ్యమంత్రి అంటున్నారని.. అవసరమైతే అన్ని పార్టీలు కలిసొస్తామని.. ఆర్థిక సంఘాన్ని నిధులివ్వాలని అడుగుతామని చెప్పారు. ఇంకేమన్నారంటే...
వీళ్లతో దేశానికి శాపం..
‘ప్రజల ప్రాణాలు ఈ సీఎంకు పట్టవు. రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి ఉండడం అరిష్టం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశానికి శాపం. కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా భయపడుతుంటే...ఎక్కడికక్కడ అన్నీ మూసేస్తుంటే.. ఈయన మాత్రం అవగాహన లేకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కరోనా వస్తే పారసిటిమల్ టాబ్లెట్ చాలు.. 60ఏళ్ల పైబడ్డవారే చనిపోతున్నారు. బ్లీచింగ్ చల్లితే సరిపోతుందని జగన్ అన్నారు. ఎంత తేలిగ్గా, తెలివితక్కువగా మాట్లాడారు! ఒకపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ వైర్‌సను పాండమిక్(మహమ్మారి)గా ప్రకటించారు. 147 దేశాలకు అది ప్రబలిపోయింది. పలువురు చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా కారణంగా ఆ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రధాని మోదీ ఈ వైర్‌సను విపత్తుగా పేర్కొన్నారు. మన దేశంలో 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందురోజు అదేమీ లేదన్నారు. మళ్లీ తప్పు గ్రహించి స్కూళ్లు, కళాశాలలు అన్నీ మూసేశారు. పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పారు. మిగతా చాలా దేశాల జనసాంద్రత కన్నా మన జనసాంద్రత చాలా ఎక్కువ. మనదేశంలో ఇది ప్రబలితే చాలా కష్టం. కెనడా ప్రధాని భార్యకు కరోనా వైరస్ వచ్చింది. ఆమె వయసు చాలా తక్కువ. ఇరాన్‌లో ఒక మంత్రి సభలో మాట్లాడుతూ.. కరోనాతో భయం లేదు. అది రాదన్నారు. మర్నాడు ఆయనకే కరోనా పాజిటివ్ వచ్చింది. పరిస్థితి దారుణంగా ఉందని అన్ని దేశాలు గగ్గోలు పెడుతుంటే.. జగన్ మాత్రం దాని నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా...తేలిగ్గా మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు కరోనా గురించి ఏం తెలుసో నాకు తెలీదు. అహంకారం, పిచ్చితనంతో మాట్లాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు లేదు.’
అంత తెలివైనవాడా..?
‘కడపలో 50 జడ్పీటీసీలుంటే 38, నెల్లూరులో 46లో 12, కర్నూలులో 53లో 16, చిత్తూరులో 65లో 29 స్థానాలు ఏకగ్రీవం చేసేశారు. అంటే ఈ ముఖ్యమంత్రికి అంత ప్రజామోదం ఉందా? అంత తెలివైనవాడా? బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఉపసంహరించేలా భయపెట్టారు. అధికారులు కావాలని తిరస్కరించారు. ఎంపీటీసీ స్థానాల్లో ఏకంగా 22 శాతం స్థానాలు ఏకగ్రీవం చేసేసుకున్నారు. తెనాలిలో టీడీపీ నేత ఇంట్లో బయటి వ్యక్తులు అర్ధరాత్రి వచ్చి గోడదూకి మద్యం సీసాలు పెట్టి వెళ్లిపోయారు. తర్వాత వాళ్లే ఫిర్యాదుచేస్తే పోలీసులు వచ్చేశారు. సీసీ టీవీ ఉండడంతో దొరికిపోయారు. గ్రామ వలంటీర్లను హోల్‌సేల్‌గా వాడుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ.. కనీసం ఆ స్థానానికైనా గౌరవం తెచ్చేలా వ్యవహరించాలి. ఈసీకి సెక్యూరిటీ మేమేం ఇవ్వాలని అంటున్నారు. అంటే రేపు సెక్యూరిటీ తీసేస్తారా? వాళ్ల చిన్నాన్నను చంపితే ఇప్పటికీ పట్టుకోలేదు. మొన్న మండలి రద్దు అన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని అంటున్నారు. ఇక కోర్టు మిగిలింది. రాజ్యాంగం నుంచే నీకు అధికారం వచ్చింది. 151 సీట్లు వస్తే నీకు రాజ్యాంగం వర్తించదని చెప్పలేదు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుచేసే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మంచివాడైతే మంచి. చెడ్డవాడైతే చెడు అని అంబేడ్కర్ చెప్పారు. ఈయన రుజువు చేస్తున్నారు. ఇంత అహంభావం, ఉన్మాదం అన్నీ కలిపి ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. విమర్శించాలని విమర్శించడం కాదు. అతడిని చూశాక నిజమేంటో తెలుస్తోంది. ఇతడి అహంకారం రాష్ట్రానికి శాపంగా మారింది.’
సత్తెనపల్లిలో ఫోర్జరీ!
చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగానే సత్తెనపల్లి నియోజకవర్గ నేత మల్లి, జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మేడా వెంకాయమ్మ వచ్చారు. చంద్రబాబు ఆమెతో మాట్లాడించారు. ‘నేను ముప్పాళ్ల మండలం గోళ్లపాడు జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. కానీ అక్కడి ఎంపీడీవో నేను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా సంతకం చేశానంటూ ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేశారు. నేను సంతకం చేయలేదు. నా సంతకం వాళ్లే పెట్టేశారు’ అని ఆరోపించారు. ‘ఇదీ జగన్‌మార్కు రాజకీయం, ఖాకీ ఉగ్రవాదం. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ముఖానే ఉమ్మేస్తారు. ముఖ్యమంత్రి పదవి, అధికారం శాశ్వతం అనుకోవద్దు. దౌర్జన్యాలు, దాడులతో ఏకపక్షంగా ఏకగ్రీవమని చెప్పుకొంటే ముందుగానే పదవి నుంచి దిగిపోవడం ఖాయం’ అని హెచ్చరించారు.
రమేశ్‌కుమార్‌ను నరసింహన్ సిఫారసు చేశారు
ఈ ఉన్మాద, అహంకారపు ముఖ్యమంత్రి అధికార కైపులో ఉండి...తాను అనుకున్నదే జరగాలన్నట్లుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘ఎన్నికల కమిషనర్‌కు కూడా కులం అంటగడుతున్నారు. మొన్న శాసనమండలిలో రాజధాని మార్పు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే దాన్ని రద్దుచేశారు. ఇప్పుడు కమిషనర్‌ను తిడుతున్నారు. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నేను నియమించానని అంటున్నారు. నేను ఆయన్ను సిఫారసు చేయలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి 2016లో కమిషనర్‌ను నియమించాల్సిన సమయంలో.. అప్పటికే రిటైరై ఉన్న ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ (చిత్తరంజన్ బిశ్వాల్)ను ఆ పదవికి ఎంపిక చేయాలనుకున్నాను. సదరు ప్రతిపాదనను అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎ్‌సఎల్ నరసింహన్‌కు పంపాను. అయితే నరసింహన్ ఆమోదించలేదు. బిశ్వాల్‌కు బదులు సీనియర్ ఐఏఎస్ రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించాలని, ఆయన మంచి అధికారి అని, ఏడేళ్లు తన కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. ఇందుకు నేను సుముఖత వ్యక్తం చేయనప్పటికీ ఆయన గట్టిగా సిఫారసు చేశారు. కాదనలేక బిశ్వాల్ స్థానంలో రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించాను. నీకు ఇష్టం లేకపోతే అందరికీ కులాలు ఆపాదిస్తావు. పత్రికలకు కులాలు ఆపాదిస్తావు. ఆ పత్రికలు నువ్వు పుట్టక ముందు నుంచీ ఉన్నాయి. నువ్వు కులంతో గెలిచావా? ఎందుకు కులం? నా జీవితంలో ఎప్పుడూ కులం చూడలేదు. నీ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తున్నావు’ అని విరుచుకుపడ్డారు.
Updated Date - 2020-03-16T09:20:05+05:30 IST