‘తప్పు’.. ఉద్యోగానికి ముప్పు!
ABN, First Publish Date - 2020-11-03T09:30:47+05:30
పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అనైతిక ఘటనల్లో భాగస్వాములైతే నియామకం రద్దవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అనైతిక ఘటనల్లో భాగస్వాములైతే నియామకం రద్దవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఏలూరుకు చెందిన ఎస్సై తన విద్యార్హతకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారి.. ప్రభుత్వం దృష్టికి చేరింది. దీంతో నియామకాలకు సంబంధించి పలు నిబంధనలతో సర్కారు సోమవారం జీవో జారీ చేసింది. పోలీసు శిక్షణలో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లు నకిలీ లేదా ఫోర్జరీవని తేలితే ఉద్యోగ నియామకానికి అనర్హులుగా పరిగణిస్తామని పేర్కొంది. అధికారులు, అనధికారుల రూపంలో ఏదైనా లబ్ధి పొందినట్లు తేలినా అనర్హులేనని, రెండో పెళ్లి చేసుకున్నా, చేసుకునే ప్రయత్నం చేసినా ఉద్యోగం ఉండదని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం నుంచి డిస్మిస్ అయినా, ఏవైనా కేసుల్లో న్యాయస్థానాలు శిక్షించినా, కేసుల వివరాలు దరఖాస్తులో పొందుపరచకపోతే ఉద్యోగ నియామకం రద్దవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Updated Date - 2020-11-03T09:30:47+05:30 IST