నాటి కాలి గాయం నేటికీ కలుక్కుమంటోంది
ABN, First Publish Date - 2020-10-03T07:19:38+05:30
’వస్తున్నా మీ కోసం’ అంటూ సాగిన పాదయాత్ర నా జీవితంలో మరువలేని ఘట్టం. సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసిన
పాదయాత్ర సహచరులతో చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ’వస్తున్నా మీ కోసం’ అంటూ సాగిన పాదయాత్ర నా జీవితంలో మరువలేని ఘట్టం. సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసిన యాత్ర అది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే భాగస్వాములై నిర్వహించిందే నా పాదయాత్ర’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 2012 అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర జరిగి సరిగ్గా 8 ఏళ్లయింది.
ఈ సందర్భంగా శుక్రవారం తన పాదయాత్ర సహచరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 208 రోజులు, 2,817 కిలోమీటర్లు, 1,250 గ్రామాల్లో సాగిన నాటి యాత్ర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ’కాలికి గాయమైనా.. అన్ని కిలోమీటర్లు నడిచానంటే.. వెన్నంటి నిలిచిన పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం.
ఆ గాయం ఇప్పటికీ కాలిలో కలుక్కుమంటూనే ఉంది. నొప్పి పుడుతూనే ఉంది. కాలు నొప్పి పుట్టినప్పుడల్లా నాటి పాదయాత్ర స్మృతులే గుర్తొస్తాయి. వినూత్న పథకాలకు పాదయాత్రే స్ఫూర్తి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజల కష్టాలు చూస్తుంటే నాటి పాదయాత్ర పరిస్థితులే నయమనిపిస్తున్నాయని తెలిపారు.
కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు
చంద్రబాబు పాదయాత్రకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్‌కట్ చేశారు.
గాంధీ మార్గంలోనే ఎదిరిద్దాం..
కుల రాజకీయాలు, దళితుల అణచివేతను గాంధీజీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదిరిద్దామని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.
Updated Date - 2020-10-03T07:19:38+05:30 IST