కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ కాలేదు
ABN, First Publish Date - 2020-12-29T08:47:34+05:30
బ్రిటన్ నుంచి వ్యాపిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న కరోనా కొత్త స్ర్టెయిన్ కేసులు రాష్ట్రంలో ఇంకా నిర్ధారణ కాలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
- సీసీఎంబీ రిపోర్టుల కోసం ఎదురుచూపు
- బ్రిటన్ రిటర్న్స్‌కు ర్యాపిడ్ టెస్టులొద్దన్న కేంద్రం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బ్రిటన్ నుంచి వ్యాపిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న కరోనా కొత్త స్ర్టెయిన్ కేసులు రాష్ట్రంలో ఇంకా నిర్ధారణ కాలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకూ బ్రిటన్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి సంఖ్య 1363కు చేరుకోగా, వారిలో 1346 మందిని గుర్తించామని చెప్పారు. మరో 17 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 11 మందికి, వారి కాంటాక్ట్‌లో ఉన్న మరో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.
బ్రిటన్ రిటర్న్స్‌లో అనంతపురంలో ఒకరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారినపడ్డారన్నారు. వారి శాంపిల్స్‌ను పుణెలోని ఎన్‌ఐవీకి, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించామని..ఆ నివేదికలు వస్తేనే సోకింది సాధారణ వైరస్సా లేక కొత్త స్ర్టెయినా అనేది తేలుతుందని చెప్పారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటన్ నుంచి వచ్చిన విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. అతని కాంటాక్ట్ కేసుగా ఆయన తండ్రికి కూడా వైరస్ సోకినట్టు తేలింది. ఇద్దరినీ కాకినాడ జీజీహెచ్‌లోని కొవిడ్ సెంటర్‌కు తరలించారు. కాగా.. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారి కాంటాక్ట్‌లకు ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేయొద్దని, ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది.
కొత్తగా 212 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 8,81,273కు చేరగా.. కొవిడ్ మరణాలు 7,078కి పెరిగాయి.
Updated Date - 2020-12-29T08:47:34+05:30 IST