వలస కూలీల తిరుగుబావుటా!
ABN, First Publish Date - 2020-05-09T09:28:23+05:30
తమను స్వస్థలాలకు పంపడంలేదంటూ వలస కార్మికులు తిరుగుబావుటా ఎగువవేశారు.
స్వస్థలాలకు వెళ్తామంటూ బయటికి..
ఎయిమ్స్, షార్‌లో రగడ
స్వరాష్ట్రాలకు పంపలేదని ఆగ్రహం..
పోలీసులపై రాళ్లదాడి
రెండుచోట్లా కార్మికులపై లాఠీచార్జి
మంగళగిరి, శ్రీహరికోట, (సూళ్లూరుపేట)మే 8 : తమను స్వస్థలాలకు పంపడంలేదంటూ వలస కార్మికులు తిరుగుబావుటా ఎగువవేశారు. కృష్ణా జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్, నెల్లూరు జిల్లా షార్‌లో శుక్రవారం కార్మికుల ఆందోళనతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి వారిని నిలువరించారు. వివరాలివీ.. లాక్‌డౌన్‌తో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు నిలిచిపోవడంతో తమను స్వస్థలాలకు పంపించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టు సంస్థలతో అనేక మార్లు గొడవలు జరగ్గా, ఇటీవల గుంటూరు ఐజీ ప్రభాకరరావు మూడు రోజుల్లో స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లుచేస్తామని హామీ ఇచ్చారు.మూడు రోజులు పూర్తయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కార్మికులు శుక్రవారం మరోమారు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా బంగ్లా వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు.
విషయం తెలిసి మంగళగిరి, తాడేపల్లి నుంచి పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని, కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాయి. పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో కార్మికులు ఎయిమ్స్‌లోని సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అటు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్‌లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. సుమారు 200 మంది జార్ఖండ్ వాసులు శుక్రవారం మధ్యాహ్నం మూకుమ్మడిగా కాలినడకన వారి రాష్ట్రాలకు బయలుదేరారు. శ్రీహరికోట ఎస్‌ఐ సరస్వతి నచ్చచెప్పినా ససేమిరా అన్నారు. దీంతో సూళ్లూరుపేట పోలీసులు అప్రమత్తమై అటకానితిప్ప వద్ద వలస కార్మికులను అడ్డుకున్నారు. కూలీలు పులికాట్‌లోకి పరుగందుకోగా పోలీసులు వెంబడించి లాఠీలతో బాది లారీలు, ఆర్టీసీ బస్సుల్లో షార్‌కు తరలించారు. షార్‌కు చేరుకున్న వెంటనే జార్ఖండ్ వాసులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Updated Date - 2020-05-09T09:28:23+05:30 IST