జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత
ABN, First Publish Date - 2020-03-16T19:28:33+05:30
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున కీలకనేతలు, మాజీలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ముహూర్తం ఖరారు!
ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గాదె వెంకట్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. గాదెతో పాటు ఆయన కుమారుడు మధుసూధన్ రెడ్డి కూడా వైసీపీలో చేరబోతున్నారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రాగా.. ఆ వార్తలను ఖండించి క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. గాదెతో పాటు శిద్దా అన్న కొడుకు శిద్దా సూర్య ప్రకాశరావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
ఎవరీ గాదె..!?
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ మంత్రిగా పనిచేశారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక ఆయన్ను తప్పించారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకోవడంతో గాదె తటస్థంగా ఉండిపోయారు. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ టీడీపీలో కీలకనేతగా కొనసాగిన గాదె.. తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
Updated Date - 2020-03-16T19:28:33+05:30 IST