పల్లెలపై పన్ను పీకుడు
ABN, First Publish Date - 2020-12-15T09:45:31+05:30
గ్రామాల్లో పేదల నుంచి చెత్త పన్ను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. చెత్తతో సంపద సృష్టించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించింది.
సేకరించే చెత్తపై పన్నులు..
ప్రతి గడపకు నెలకు రూ.60..
పైలెట్‌గా మొదలైన వసూలు
జిల్లాకు 2మండలాల్లో అమలు
వాటితో కార్మికులకు వేతనాలు
నాడు చెత్తనుంచి సృష్టించిన సంపదలోంచి జీతాలు చెల్లింపు
ఇప్పుడు జనంపైనే ఆ భారం
గ్రీన్ అంబాసిడర్లూ తొలగింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామాల్లో పేదల నుంచి చెత్త పన్ను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. చెత్తతో సంపద సృష్టించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించింది. గ్రామాల నుంచి చెత్త కొనుగోలు చేసే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అదే గ్రామాలపై ఇప్పుడు చెత్త పన్నువేసి, ఖజానా నింపుకొనేందుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అలాగే, చెత్త సేకరణ కోసం నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థను రద్దు చేసేసింది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు ఏడాదిన్నరగా సామాన్యుడే ఎర అవుతున్నాడు. ఇప్పటికే శ్లాబ్‌లు మార్చి విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. డీజిల్, పెట్రోల్ సెస్ పెంచడంతో నిత్యావసర వస్త్తువుల ధరలు కొండెక్కి దిగడంలేదు. ఆర్టీసీచార్జీలు పెంచారు.
ఈ కోవలోనే చెత్తపన్ను విధింపు!
చెత్తపన్నును నెలకొకసారి పంచాయతీరాజ్ శాఖ వసూలు చేస్తుంది. ఈ పన్ను కింద ప్రతి కుటుంబం రోజుకు రూ.రెండు చొప్పున నెలకు రూ.60 చెల్లించాలి. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో రెండు మండలాల్లో ఇప్పటికే ఈ పన్ను వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చే నిధులను పంచాయతీ ఖాతాల్లో జమచేసి పారిశుధ్య కార్మికులకు వేతనాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.
చెత్తే సంపద..
గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. గ్రామాల్లో పాడిపశువులపై ఆధారపడే కుటుంబాలే ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పేడ నుంచి వర్మికంపోస్టు తయారుచేయడం ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఘన వ్యర్థాలషెడ్డు చొప్పున సుమారు 10 వేల పైచిలుకు షెడ్లును ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.4 లక్షలు వరకు వెచ్చించింది. గ్రామానికి సమీపంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన సుమారు రూ.700 కోట్లు విలువ చేసే షెడ్లు పంచాయతీలకు ఆస్తిగా సంక్రమించాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీలకు చెత్త తరలించేందుకు అవసరమైన ట్రైసైకిళ్లు, ట్రాక్టర్లను సమకూర్చుకోలేవు. వాటిని కొనుగోలు చేసే స్ధోమత ఉండదు. దీనికోసం ప్రభుత్వమే స్వచ్ఛభారత్ నిధులతో వాటిని కొనుగోలు చేసి సరఫరా చేసింది. పేడను సేకరించి షెడ్లలో మురగబెట్టి వర్మికంపోస్టు తయారుచేసి విక్రయించేందుకు అవసరమైన సిబ్బందిని గ్రీన్ అంబాసిడర్లు పేరుతో నియమించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది దాకా నియమితులయ్యారు. వారికి నెలకు రూ.ఆరువేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో షెడ్‌కు ఇద్దరు గ్రీన్ అంబాసిడర్లుతో పాటు ఆ షెడ్‌కు వాచ్‌మన్‌ను కూడా నియమించింది. ప్రారంభంలో ఏడాది పాటు గ్రీన్ అంబాసిడర్లు, వాచ్‌మన్లకు వేతనాలు స్వచ్ఛ భారత్‌మిషన్ ద్వారా అందించి, ఆ తర్వాత నుంచి పంచాయతీలు వర్మీ ద్వారా తమకొచ్చే ఆదాయంతో వేతనాలు అందించాలని భావించింది. మళ్లీ ఈ ఏడాది కూడా 9 నెలల పాటు గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా అందిస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ.. పైలట్ విధానంలో కుటుంబాల నుంచి ఫీజు ఎందుకు వసూలుచేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు.
ప్రారంభం నుంచీ వేతన వెతలే...
ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్లును నియమించినప్పటికీ స్వచ్ఛభారత్ ద్వారా వారికి మొదటి సంవత్సరం వేతనాలు ఇవ్వడంలో విఫలమైంది. కొంత మంది గ్రీన్ అంబాసిడర్లుకు మొదటి ఆరు నెలలు వేతనాలు ఇస్తూ సీఎ్‌ఫఎంఎస్ ద్వారా జీతాల బిల్లులు వెళ్లినప్పటికీ ఆర్థికశాఖ నుంచి వారికి వేతనాలు విడుదల కాలేదు. కొత్త ప్రభుత్వంలో గ్రీన్ అంబాసిడర్లును, ఘన వ్యర్థాల నిర్వహణను పట్టించుకున్న వారు లేరు. పైగా గ్రామాల్లో ‘చెత్త’ రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో కొన్నిగ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనందున ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగిగా రాణించవచ్చన్న ఆశతో మరి కొంత మంది వేతనాలు అందకపోయినా ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పంచాయతీలు వాటి సొంత నిధుల నుంచి వారికి వేతనాలు అందిస్తున్నాయి.
Updated Date - 2020-12-15T09:45:31+05:30 IST