వేతనాలకూ నగదు లేదు
ABN, First Publish Date - 2020-05-09T09:18:53+05:30
మునిసిపాలిటీలకు ఆర్థిక లోటు వెంటాడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కావడం లేదు.
మున్సిపాలిటీల్లో ఆర్థిక లోటు
వసూలు కాని ఆస్తిపన్ను
లాక్‌డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు
(పలాస)
మునిసిపాలిటీలకు ఆర్థిక లోటు వెంటాడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కావడం లేదు. దీంతో రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే.. మునిసిపాలిటీలు ఆర్థికంగా మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీలు ఉన్నాయి. మునిసిపాలిటీల్లో పారిశుధ్య ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల జీతాలు, విద్యుత్ బిల్లులు, వాహనాలకు డీజిల్, కార్యాలయ నిర్వహణ తదితర వాటికి ఆస్తిపన్ను నిధులను వినియోగించుకోవాలి. లాక్‌డౌన్‌తో ఆస్తి పన్ను వసూళ్లు మందగించాయి. మరోవైపు ఉన్న కాస్త నిధులను కరోనా ప్రత్యేక అవసరాల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు అందాయి. దీంతో సిబ్బంది జీతభత్యాలకు సైతం నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఆస్తిపన్ను లక్ష్యం కోటి రూపాయలు కాగా, రూ.40 లక్షలు మాత్రమే వసూలైంది. విద్యుత్, ఒప్పంద కార్మికులకు వేతనాలు ఇవ్వడానికే ఈ నిధులు సరిపోయాయి. మిగిలిన అభివృద్ధి పనులు, కార్యాలయ నిర్వహణకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. ఆమదాలవలస మునిసిపాలిటీ వేతనాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడి ఆర్థిక ఇబ్బందులను అధికారులు ప్రభుత్వానికి వివరించారు. పాలకొండ, రాజాం నగర పంచాయతీలు కూడా ఆర్థికంగా చితికిపోయి ఇదే బాటలో నడుస్తున్నాయి.
శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాల్లో మాత్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిర్వహణ కొనసాగుతోంది. పలాస-కాశీబుగ్గ వార్షిక ఆదాయం రూ.4.50 కోట్లు కాగా, గతంలో మిగిలిన నిధులు కూడా ప్రస్తుతం వినియోగించుకుంటూ ఆర్ధిక లోటును పూడ్చుకుంటున్నాయి. శ్రీకాకుళం.. కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో ప్రత్యేకంగా నిధులు వస్తున్నాయి. దీంతో నిర్వహణకు ఇబ్బందులు లేవు. ప్రభుత్వం స్పందించి మిగిలిన మునిసిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేయకపోతే.. వచ్చే నెల నుంచి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితికి చేరుకుంటాయి.
‘ప్రత్యేక’ నిధులేవీ?
వాస్తవానికి మునిసిపాలిటీల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం చేయూత అందించాల్సి ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక నిధులు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రాకపోవడం విశేషం. 14వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసినా, అభివృద్ధి పనులు ప్రాథమిక దశలోనే ఉండిపోయాయి. దీంతో రెండేళ్ల నుంచి దాదాపు అన్నీ మునిసిపాలిటీల్లో పనులు జరగడం లేదు. దీనికి తోడు నిర్మాణ రంగ ధరలు కూడా పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పనుల ద్వారా వచ్చే సెస్‌లతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంది. కరోనా ప్రత్యేక సమయంలో రాష్ట్ర పురపాలక మంత్రి, అధికారులు స్పందించి కనీసం ఒప్పంద కార్మికుల జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ కోసం నిధులు విడుదలకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
పన్నులు చెల్లించకపోతే కష్టమే..టి.నాగేంద్ర కుమార్, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్.
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి ఆస్తిపన్ను సగమే వసూలైంది. గత ఏడాది మిగిలిన మొత్తాన్ని ప్రస్తుతం వినియోగిస్తున్నాం. రిజిస్ట్రేన్ల శాఖ ద్వారా రూ.2 కోట్లు రావడంతో సాధారణ నిధులకు జమ చేసి వాటిని సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగిస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పన్నులు కడితే మునిసిపాలిటీలకు ఇబ్బందులు ఉండవు. లేకుంటే నిర్వహణ కష్టమే.
Updated Date - 2020-05-09T09:18:53+05:30 IST