నిశిరాత్రిలో ఘోరం!
ABN, First Publish Date - 2020-03-16T09:31:11+05:30
సరుబుజ్జిలి మండలం చిగురువలస, కొత్తకోట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు, సమీప బంధువులు 12 మంది కలిసి
ఆటో బోల్తాపడి నలుగురి దుర్మరణం
ఇందులో ముగ్గురిది ఒకే కుటుంబం
ఏడుగురికి తీవ్రగాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
స్వల్పగాయాలతో బయటపడిన చిన్నారి
డ్రైవర్ మద్యం మత్తే కారణం
భైరి-సింగుపురం అడ్డురోడ్డుకు కూతవేటు దూరంలో ప్రమాదం
వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన
(శ్రీకాకుళం రూరల్/సరుబుజ్జిలి)
సరుబుజ్జిలి మండలం చిగురువలస, కొత్తకోట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు, సమీప బంధువులు 12 మంది కలిసి నరసన్నపేటలోని వివాహానికి ఆటోలో వెళ్లారు. అర్ధరాత్రి వివాహం అనంతరం 12 గంటల సమయంలో స్వగ్రామాలకు తిరిగి బయలుదేరారు. అక్కడి 30 నిమిషాల తరువాత హైవే నుంచి భైరి-సింగుపురం అడ్డురోడ్డుకు చేరుకున్నారు. అక్కడ నుంచి అలికాం-బత్తిలి రోడ్డుకు చేరుకున్న కొద్ది క్షణాల్లో వారి ఆటో బోల్తా పడింది. టవర్ నిర్మాణం కోసం వేసిన మట్టి, కాంక్రీట్ దిబ్బపై ఆటో వేగంగా ఎక్కడంతో పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాన్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది.
ఈ ఘటనలో తాలాడ వెంకటి (76), ఆయన కుమారుడు తాలాడ దాలిరాజు (39), ఆయన కుమార్తె సురకాల శ్రీలత (28)లు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రావులవలస గణేష్ (46) కన్నుమూశారు. తాలాడ చిన్నారావు, తాలాడ తవిటిమ్మ, తాలాడ కుమారి, వెంకటనర్సమ్మ, మూలుగు రాజు, పోలాకి రామారావు, ఆటో డ్రైవర్ ఆదినారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. సురకాల ప్రసన్న అనే ఐదేళ్ల చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. వీరంతా శ్రీకాకుళం రిమ్స్, విశాఖ కేజీహెచ్‌ల్లో చికిత్సపొందుతున్నారు. ఇందులో వెంకటి భార్య వెంకటనర్సమ్మ, కోడలు తవిటమ్మల పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనలో తండ్రీ కొడుకులు తాలాడ వెంకటి, దాలిరాజు మృతువ్యాత పడగా...అత్తా కోడళ్లు వెంకట నర్సమ్మ, తవిటమ్మ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దాలిరాజు, తవిటమ్మ దంపతులకు రాజేశ్వరి (12), స్పందన (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మరణం, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
వెంకటి కుమార్తె శ్రీలతకు ఆరు సంవత్సరాల కిందట విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన సురకాల శ్రీనుతో వివాహమైంది. వీరికి ప్రసన్న అనే ఐదేళ్ల చిన్నారి ఉంది. తల్లితో కలిసి వివాహానికి హాజరైన ప్రసన్న స్వల్పగాయాలతో మృత్యుంజయురాలిగా బయటపడింది. మృతుడు రావులవలస గణేష్ మంగళగిరి పోలీస్‌క్వార్టర్స్‌లో దోబీగా పనిచేస్తున్నాడు. వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రిమ్స్ వద్ద మిన్నంటి రోదనలు
రిమ్స్ వద్ద రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవ్వడం, ఏడుగురు వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతుండడంతో గ్రామస్థులు, బంధువులు పెద్దఎత్తున శ్రీకాకుళం రిమ్స్ వద్దకు చేరుకున్నారు. వారి రోదనతో రిమ్స్ ప్రాంగణంలో విషాదం అలుముకుంది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉండడం, కునుకు తీయడం ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-03-16T09:31:11+05:30 IST