గణపయ్యా కరుణించు..
ABN, First Publish Date - 2020-08-22T08:56:38+05:30
వినాయకా... నీ చవితి వస్తుందంటే మా సంతోషానికి అవధులు ఉండవు. ఊరంత పందిళ్లు... వీధివీధినా విద్యుల్లతలు... మిరుమిట్లు గొలిపే కాంతులు... పాటలతో హోరెత్తే మైకులు... డీజేలు... సాంస్కృతిక కార్యక్రమాలు... పల్లె నుంచి పట్నం దాకా
కరోనాను వదిలించు!
(శ్రీకాకుళం డెస్క్):
వినాయకా... నీ చవితి వస్తుందంటే మా సంతోషానికి అవధులు ఉండవు. ఊరంత పందిళ్లు... వీధివీధినా విద్యుల్లతలు... మిరుమిట్లు గొలిపే కాంతులు... పాటలతో హోరెత్తే మైకులు... డీజేలు... సాంస్కృతిక కార్యక్రమాలు... పల్లె నుంచి పట్నం దాకా ఒకటే సందడి... ఆబాలగోపాలంలో అంతులేని ఆనందం. నెల రోజుల ముందు నుంచే అంతటా పండగ వాతావరణం. ఇక నవరాత్రి ఉత్సవాలు సాగినన్ని రోజులూ ఉపవాసాలూ... ప్రత్యేక పూజలూ మామూలే. పూజలు మొదలైన రోజే కాదు... నీ విగ్రహాల నిమజ్జనం కూడా మాకు ఓ పండగే. నీ వేడుకంటే ఐక్యతకు నిదర్శనం. ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా వేడుకల నిర్వాహకులు నీ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పోటీలు పడడమూ నీకు తెలిసిందే. బహుశా ఏ దేవుడి ఉత్సవంలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించవు.
అంతేనా? నీ ఉత్సవాలు వస్తున్నాయంటే కళాకారులకూ సవాలే. కొత్త ఆలోచనలకు వారు పదును పెట్టాల్సిందే. ఓ గబ్బర్‌సింగ్‌గానో... ఓ బాహుబలిగానో... తాజా సంఘటనకు నిదర్శనంగానో నిన్ను తీర్చిదిద్ది మురిసిపోవడమూ తెలిసిందే. ఇక నీ విగ్రహాలు విక్రయించి... ఉపాధి పొందేవారు ఎందరో. నీ చవితి సామగ్రి.. పండ్లూ పూలూ అమ్ముకొని పొట్ట పోషించుకునే వారికీ లెక్కే ఉండదు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అంతో ఇంతో సంపాదించే కళాకారులూ ఎంతోమంది.
నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం సరదాలు పంచడమే కాదు... అవి ఎందరికో ఆకలి తీర్చే ఉత్సవాలు కూడా. అందుకే అన్ని వర్గాలకూ నీవంటే అంత భక్తి.. నమ్మకం. వానలొచ్చినా... వరదలొచ్చినా... ఏ ప్రకృతి విపత్తులొచ్చినా... లెక్క చేయకుండా... నీ సేవలోనే తరించడం మాకు అలవాటు. ఆ విపత్తుల నుంచి నువ్వే కాపాడతావనే విశ్వాసం. నీవూ..అంతే. మమ్మల్ని ఆ కష్టాల నుంచి కాపాడడంలో నిజంగా ఆదిదేవుడివే.
కానీ...
మా ఊహ తెలిశాక మొట్టమొదటిసారిగా నీ వేడుకలకు ఊరూవాడా దూరమవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పల్లెలు... పట్టణాలు అనే తేడా లేకుండా వికృతంగా దాడి చేస్తోంది. ఎంతోమందిని అనారోగ్యం బారిన పడేస్తోంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నవారిని కూడా విగతజీవులుగా మారుస్తోంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి... అరవయ్యేళ్ల వృద్ధుల వరకూ ఎందరినో ఈ రాక్షసి పొట్టన పెట్టుకుంటోంది.
కన్నవారిని బిడ్డలు చివరి చూపునకు నోచుకోకుండా చేస్తోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడేలా చేస్తోంది. బంధాలూ... బంధుత్వాలను దెబ్బతీస్తోంది. ఉపాధి లేకుండా చేస్తోంది. నలుగురు కలసి ఉంటే కరోనా వైరస్ దాడి చేస్తోంది. ఈ పరిస్థితిలో ఈ ఏడాది సామూహిక పూజలు చేయలేకపోతున్నాం. వీధుల్లో మండపాలనూ పెట్టలేకపోతున్నాం. అందరమూ ఒక్కచోట చేరి భజనలూ చేయలేకపోతున్నాం. నిన్ను విభిన్న రూపాల్లో తీర్చిదిద్ది... వినూత్నంగా అలంకరించి... పూజలు చేయాలన్న మా ముచ్చటనూ తీర్చుకోలేకపోతున్నాం. దేవలోకం నుంచి అంతా చూస్తున్న నీకు మా దుస్థితి అర్థమవుతుందని విశ్వసిస్తున్నాం.
అందుకే ఈసారి వినాయక చవితి రోజున ఇళ్లలో మాత్రమే మా శక్తికొద్దీ ఉండ్రాళ్లూ.. వడపప్పూ పెట్టి... నిన్ను పూజించుకుంటాం. మనసారా కొలుచుకుంటాం. విజయదశమి నాటికైనా కరోనా మహమ్మారి అంతమయ్యేలా చూడు స్వామీ. ఈ రాకాసిని అంతం చేసే మందులను త్వరగా మాకు అందుబాటులోకి తెచ్చి... మా పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామీ. వచ్చే ఏడాదికి కరోనా రక్కసి ఈ భూమ్మీదనే లేకుండా చూడు స్వామీ. మేమంతా ఘనంగా నీ ఉత్సవాలు నిర్వహించేలా శక్తిని ప్రసాదించు స్వామీ...
- ఇట్లు నీ భక్తుడు!
Updated Date - 2020-08-22T08:56:38+05:30 IST