ఉపాధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం
ABN, First Publish Date - 2020-11-13T05:36:42+05:30
ఉపాధి హామీ పథకం పనులను అధికారులు పక్కాగా పరిశీలించాలని...నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని గ్రామీణ అభివృద్ధి శాఖ రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య ఆదేశించారు
గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్, నవంబరు 12: ఉపాధి హామీ పథకం పనులను అధికారులు పక్కాగా పరిశీలించాలని...నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని గ్రామీణ అభివృద్ధి శాఖ రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య ఆదేశించారు. స్థానిక డీఎల్‌ఆర్సీ ఉపాధి హామీ పథకం భవనంలో ఏపీడీలు, ఇతర సిబ్బందితో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను ఏపీడీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికను అందజేయాలన్నారు. దీనివల్ల పనుల్లో నాణ్యత ఉంటుందని చెప్పారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలని.. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. శాఖాపరంగా చేపట్టే అన్ని కార్యక్రమాలపై అవగాహన పెంచుకొని లక్ష్యాలకు చేరుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోట బోర్డులను ఏర్పాటుచేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. ఖర్చుచేసిన ప్రతి రూపాయికీ పక్కాగా రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. డ్వామా పీడీ కూర్మారావు మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. మెటీరియల్ పనులు వేగవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ కల్యాణచక్రవర్తి, ఏపీడీ లక్ష్మీపతి, పరిపాలనాధికారి భానురెడ్డి, పర్యవేక్షణాధికారి అప్పలనాయుడు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
శతశాతం వినియోగించాలి
ఉపాధి హామీ పథకం నిధులను శతశాతం వినియోగించాలని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మం జూరైన నిధులతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ, సచివాలయ భవనాల నిర్మాణం, తదితర పనులు మంజూరు చేసినట్లు వివరించారు.
Updated Date - 2020-11-13T05:36:42+05:30 IST