వ్యక్తి దారుణ హత్య!
ABN, First Publish Date - 2020-11-04T05:29:12+05:30
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దాయాది కుటుంబాల మధ్య వివాదంపై గ్రామపెద్దల వద్ద పంచాయితీ నడుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలే కారణం
గ్రామ పెద్దల సమక్షంలోనే దాడి
పిండ్రువాడ కాలనీలో ఘటన
హిరమండలం, నవంబరు 3: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దాయాది కుటుంబాల మధ్య వివాదంపై గ్రామపెద్దల వద్ద పంచాయితీ నడుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హిరమండలం మండలం పిండ్రువాడ కాలనీలో సోమవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిండ్రువాడకాలనీలో నివాసం ఉంటున్న కరణం తిరుపతిరావు (48), ఆయన పెద్దనాన్న కుమారులు కరణం సత్యం, విశ్వనాథంల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇరువర్గాల వారు గ్రామపెద్దలను ఆశ్రయించడంతో సోమవారం సమావేశమయ్యారు. అక్కడ మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. గ్రామపెద్దలు వారించినా ఫలితం లేకపోయింది. సత్యం, విశ్వనాథంలు కర్రతో మోదడంతో తిరుపతిరావు అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి మృతిచెందాడు. మృతుడికి భార్య సత్యవతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరగగా..కుమారుడు లోకేష్ ఇంజనీరింగ్, చిన్న కుమార్తె మాధురి ఇంటర్ చదువుతున్నారు. రక్తపుమడుగులో ఉన్న భర్త మృతదేహం వద్ద భార్య సత్యవతి, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ మధుసూధనరావు సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను విచారించారు. శవపంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. హత్యకు సంబంధించి కరణం సత్యం, విశ్వనాథం, చిన్నమ్మి, ఈశ్వరిలపై కేసు నమోదు చేసినట్టు సీఐ రవిప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని..త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
Updated Date - 2020-11-04T05:29:12+05:30 IST