రోడ్డు ప్రమాదంలో రీలర్ మృతి
ABN, First Publish Date - 2020-12-05T06:38:35+05:30
గుంటూరు జిల్లా చౌడవరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురానికి చెందిన రియాజ్(50) మృతి చెందాడు.
ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుండగా దుర్ఘటన
8 మరో ఏడుగురికి గాయాలు 8 క్షతగాత్రులకు వైద్యసేవలందేలా ఎమ్మెల్యే బాలకృష్ణ చర్యలు
8 బాధితులను పరామర్శించిన హిందూపురం ఎంపీ, ఎమ్మెల్సీ
గుంటూరు, డిసెంబరు 4: గుంటూరు జిల్లా చౌడవరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురానికి చెందిన రియాజ్(50) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టు రీలర్ల అసోసియేషన్ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పది రోజులుగా హిందూపురంలో సమ్మె చేస్తున్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు పట్టు రీలర్ల అసోసియేషన్ సభ్యులు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చౌడవరం వద్దకు రాగానే మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందగా హిందూపురానికి చెందిన ముస్తఫా, ధర్మవరానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆలం వలీ, తిరుపాల్, కదిరికి చెందిన హైదర్ వలీ, ఇంతియాజ్, డ్రైవర్ ముక్తియార్‌లు గాయపడ్డారు. పోలీసు పెట్రోలింగ్ వాహనంలో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. రియాజ్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరుకుమార్తెలుండగా నలుగురికి వివాహమైంది. మరో కుమారుడికి వివాహం కావాల్సి ఉంది. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటనే స్పందించి టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావును గుంటూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి గాయపడిన వారికి వైద్యసదుపాయాలు అందేలా సహకారం అందించాలని సూచించారు. రియాజ్ మృతికి ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పరామర్శించారు. నల్లపాడు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-05T06:38:35+05:30 IST