ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రకాశం’ కోల్పోయిన ఉద్దానం

ABN, First Publish Date - 2020-09-14T09:15:29+05:30

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బెందాళం ప్రకాష్‌ (64) ఆదివారం మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెందాళం అస్తమయం

 ఎమ్మెల్యే అశోక్‌కు పితృ వియోగం

అశ్రునయనాల నడుమ రామయ్యపుట్టుగలో అంత్యక్రియలు

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, అభిమానులు


కవిటి, సెప్టెంబరు 13: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బెందాళం ప్రకాష్‌ (64) ఆదివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల స్వగ్రామమైన రామయ్యపుట్టుగకు చేరుకుని.. ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య జ్యోతీబాల, ఇద్దరు కుమార్తెలు ఆశ, సోఫియా, కుమారుడు అశోక్‌ ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు అశోక్‌ ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్‌ మృతితో ఉద్దానం శోకసంద్రమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆయనది చెరగని ముద్ర. ఉన్నత కుటుంబానికి చెందిన బెందాళం దశరధరామ్మూర్తి, సభాకీర్తమ్మకు ఏకైక సంతానమైన ప్రకాష్‌.. 1956 జనవరి 21న జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. సామాజిక సేవలో చురుకైన పాత్ర పోషించేవారు. 


1970వ దశకంలో ఉద్దానంలో యువజన సంఘాల ఏర్పాటు, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణ, సాంస్కృతిక, కళారంగాలు, కళాకారుల ప్రోత్సాహంలో ముందుండేవారు. ఆయనకు కళలంటే ఎనలేని అభిమానం. రంగస్థల కళాకారుడిగా కూడా రాణించారు. నాటికలు, నాటకాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించేవారు. దర్శకత్వ బాధ్యతలు సైతం నిర్వహించారు.   సినిమా రంగం వైపు కూడా వెళ్లారు. సజీవమూర్తులు, శాంతిసమరం అనే సినిమాల్లో హీరోగా నటించారు. ముద్దమందారం, నాలుగు స్తంభాలాట వంటి సినిమాలో అవకాశం వచ్చినా, సున్నితంగా తిరస్కరించారు. తనకిష్టమైన సామాజిక సేవల వైపే చివరకు మొగ్గు చూపారు. 


1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. 1984లో కవిటి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. కవిటిని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్ది.. అప్పటి కలెక్టర్‌ చెల్లప్ప చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ గెలుపులో క్రియాశీలక పాత్ర వహించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 20 వేల ఓట్లను సాధించారు. రాష్ట్రంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సాధించినది ప్రకాషే. అందుకే అధిష్ఠానం ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకుంది. అప్పటి నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2001-2006 మధ్య కవిటి ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించారు. 2001-04 మధ్య ఆంధ్రా బ్యాంకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నిబద్ధత..  కుమారుడు డాక్టర్‌ అశోక్‌బాబుకు లాభించింది. 2014, 2019 ఎన్నికల్లో అశోక్‌ ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు దోహదం చేసింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రకాష్‌కు అభిమానులున్నారు.


అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా మెలిగారు. దివంగత నేత.. కేంద్ర మాజీమంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడికి కుడి భుజంగా ఉండేవారు. నేటి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో సన్నిహితంగా ఉండేవారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల్‌తో స్నేహంగా మెలిగేవారు. బెంతు ఒరియాల కుల ఽధ్రువీకరణ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. నాటి కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడుతో కలిసి ప్రధాని వాజ్‌పేయికి స్వయంగా కలిసి సమస్యను వివరించారు. కవిటిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నిర్మాణం ఆయన చొరవే.


ఊరూరా చందాలు పోగుచేసి దాతల సహకారంతో కాలేజీ నిర్మాణం చేపట్టారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు కాజ్‌వే నిర్మాణం, కంచిలి మండలం డీజీ పురం, కొండపోలేరు, గంగాధరపురం గ్రామాలకు  పక్కా రహదారి నిర్మాణం ఆయన చొరవేనంటూ స్థానికులు గుర్తు చేసుకుంటారు. సోంపేట బీలలో థర్మల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన ఘనత ఆయనదే. అప్పట్లో ఎంపీపీగా ఉన్న ప్రకాష్‌ భావితరాల మనుగడను ప్రశ్నార్థకంగా మిగిల్చే పరిశ్రమ ఏర్పాటు వద్దంటూ మండల పరిషత్‌లో తీర్మానం రూపొందించి నాటి ప్రభుత్వానికి నివేదించారు.  అటువంటి వ్యక్తి మృతితో అభిమానులు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.  


యువజన సంఘాల నాయకుడు

ప్రకాష్‌కు ఆది నుంచి సామాజిక సేవ అంటే మక్కువ. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన యువజన సంఘాలు ఉద్దానం అభివృద్ధిలో పెనవేసుకున్నాయి. 1970 దశకంలో ప్రగడపుట్టుగలో శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం, కవిటి ఉషోదయ యువజన సంఘం ఏర్పాటు చేశారు.  తరువాత వందలాది యువజన సంఘాల ఏర్పాటులో ఆయన  కీలకపాత్ర పోషించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా సేవలందించేవారు. అత్యవసర, అనారోగ్య సమయాల్లో తలుపుతట్టిన వారికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేవారు. తన సొంత వాహనంలో విశాఖ, శ్రీకాకుళం, బరంపురం ఆస్పత్రులకు తరలించేవారు. అలాగే కవిటిలో జూనియర్‌ కాలేజీ నిర్మాణానికి ఊరూరా జోలి పట్టడమే కాకుండా ఫర్నీచర్‌, ఇతర అవసరాల కోసం తన తోటలో చెట్లను విరాళంగా ఇచ్చారు.  


కళారంగంలో

ఉష్‌కాకి నాటికలో ఉత్తమ విలన్‌గా రాష్ట్రస్థాయిలో అవార్డు పొందారు. ఆయన దర్శకత్వం వహించి నటించిన సమాధి కడుతున్నాం చందాలివ్వండి, సింహాద్రి అప్పన్న కొండ దిగిరా, మీరైనా ఏం చేస్తారు,  ఆగండి కొంచెం ఆలోచించండి, ఈ చరిత్ర ఏసిరాతో, ఉష్‌కాకి నాటికలు ఎంతో గుర్తింపు పొందాయి. అవార్డులు సొంతం చేసుకున్నాయి.


కన్నీటి వీడ్కోలు

ప్రకాష్‌ అంత్యక్రియలు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, టీడీపీ శ్రేణుల ఆశ్రునయనాల నడుమ నిర్వహించారు. కుమారుడు బెందాళం అశోక్‌ తండ్రి చితికి నిప్పంటించారు. ప్రకాష్‌ మృతివార్త విషయం తెలుసుకొని నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు రామయ్యపుట్టుగకు తరలివచ్చారు. నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కార్యదర్శి నారా లోకేష్‌ ఫోన్లో ఎమ్మెల్యే అశోక్‌ను పరామర్శించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు.

Updated Date - 2020-09-14T09:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising