గవర్నర్‌ను కూడా బెదిరిస్తున్నారేమో..!: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2020-04-12T18:07:02+05:30
ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను..
అమరావతి: ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్ధించిందని, మరి రమేష్ కుమార్ తొలగింపును రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ గంట కూడా ఆపలేకపోయారని టీడీపీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. రమేష్ కుమార్‌ని భయపెట్టినట్లు గవర్నర్‌ని కూడా భయపెట్టారా? అని అన్నారు. ప్రథమ పౌరుడిగా మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, దీనిని గవర్నర్ నివృత్తి చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌ను కాదంటే రాష్ట్రంలో ఎవ్వరూ బతకకూడదనే పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యoలో ఇంత కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ చూడలేదన్నారు. 65ఏళ్ల లోపు ఉన్న రమేష్ కుమార్‌ని అర్ధాంతరంగా తొలగించి.. 84 ఏళ్ల పైబడిన వ్యక్తి క్వారెంటైన్ నిబంధనలు పాటించకుండా వేరే రాష్ట్రం నుంచి విజయవాడకు వచ్చి బాధ్యతలు తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఆయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలంటే క్వారెంటైన్‌లో ఉండాలని వైసీపీ మంత్రులు, నేతలు మాట్లాడుతున్నారని, వారు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి తిరగొచ్చా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే పాలించాలని ప్రజలు అధికారం ఇచ్చారన్న విషయాన్ని సీఎం జగన్ గ్రహించాలని సోమిరెడ్డి సూచించారు.
Updated Date - 2020-04-12T18:07:02+05:30 IST