చీరాలలో మళ్లీ కుమ్ములాట.. వైసీపీ వర్గీయుల డిష్యుం.. డిష్యుం..
ABN, First Publish Date - 2020-12-15T06:17:00+05:30
చీరాల వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి తారస్ధాయికి చేరాయి. మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ సాక్షిగా ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది.
మోపిదేవి సాక్షిగా బహిర్గతమైన విభేదాలు
ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గాల పరస్పరదాడులు
ఐదుగురికి గాయాలు..
వాడరేవులో కృష్ణమోహన్‌ను నిలదీసిన మత్స్యకార మహిళలు
గోబ్యాక్ అంటూ నినాదాలు
చీరాల, డిసెంబరు 14 : చీరాల వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి తారస్ధాయికి చేరాయి. మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ సాక్షిగా ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. తొలుత ప్రసాదనగరంలోనూ, అనంతరం వాడరేవు, కఠారివారిపాలెం, రామన్నపేటల్లో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చీరాల ఏరియా వైద్యశాలలో చేరి ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లారు. మరో ఇద్దరికి గాయాలైనప్పటికీ వారి గురించి ఇంకా అధికారికంగా ధ్రువీకరించడం లేదు. గాయపడిన ఐదుగురులో ఇద్దరు బలరాం వర్గీయులు, ముగ్గురు ఆమంచి వర్గీయులని చెప్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మరోసారి వాతావరణం వేడెక్కింది.
చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య జరిగిన కొట్లాట, తదుపరి ఘటనల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సోమవారం చీరాల వచ్చారు. కఠారివారిపాలెం వారు చేసిన దాడిలో గాయపడిన 13 మంది వాడరేవు మత్స్యకారులను పరామర్శించడంతోపాటు, రెండు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడాల్సి ఉంది. అందులో భాగంగా ఆయన చీరాలలో బాధితులను పరామర్శించే క్రమంలో ఆసుపత్రి వెలుపల కరణం, ఆమంచి వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్దారు. వారిని పోలీసులు నిలువరించారు. అనంతరం మోపిదేవితోపాటు, ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఇతర నేతలంతా కాన్వాయ్‌గా వాడరేవు బయల్దేరారు.
గొడవ ప్రారంభమైంది ఇలా..
కాన్వాయ్‌లో ఒకరి వాహనాలను ఒకరు అధిగమించేందుకు బలరాం, కృష్ణమోహన్ అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొందరు వాహనాల బయట నిలబడి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రసాదనగరం దాటిన తర్వాత ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా ఆమంచి వర్గానికి చెందిన బజ్జిబాబు, సతీష్‌కు గాయాలయ్యాయి. తమ కారును వెంకటేష్ కారు పక్కన ఉన్నవారు తన్నారని, వాహనం దిగి వెనకున్న వెంకటేష్ కారును ఆపి ఎందుకు తన్నారని అడుగుతున్న క్రమంలో ఆ కారులో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు తమను గాయపరిచారని బజ్జిబాబు, సతీష్‌లు చీరాల ఏరియా అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేటకు చెందిన వెంకట శివాజీ అనే యువకుడు తాను మోపిదేవి పర్యటనలో వాడరేవు నుంచి కఠారివారిపాలెంకు వెళ్లే సమయంలో పెద్దబ్బాయినాయుడు, ప్రకాష్‌నాయుడు, ప్రకాష్, సునీల్ మరో ఇద్దరు దాడి చేసి గాయపరిచారని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనుచరుడు అంజిరెడ్డిని కఠారిపాలెంలో పెద్దబ్బాయినాయుడు, మరికొందరు దాడిచేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి మనుషులు రామన్నపేటలో ఆమంచి అనుచరుడు వెంకటస్వామిరెడ్డిని కొట్టినట్లు తెలిసింది. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధించి అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. డీఐజీ త్రివిక్రమవర్మ స్వయంగా బందోబస్తులో పాల్గొని శాంతిభద్రతలు పర్యవేక్షించినప్పటికీ ఘర్షణలు జరగటం గమనార్హం.
గందరగోళం సృష్టించి పరామర్శించడానికి వచ్చావా!
వాడరేవు వద్ద ఆమంచిని నిలదీసిన మహిళలు
ప్రసాదనగరం వద్ద ఘర్షణ నేపథ్యంలో ముఖ్య నేతలు మినహా మిగిలిన వారిని పోలీసులు కీర్తివారిపాలెం చెక్‌పోస్టు వద్ద నిలువరించారు. మోపిదేవి, ఇతర నేతల వాహనాలను మాత్రమే అనుమతించారు. అనంతరం వారంతా వాడరేవుకు చేరుకున్నారు. అక్కడ స్థానికులతోపాటు పెద్దసంఖ్యలో మహిళలు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమంచి గోబ్యాక్.. ఆమంచి డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు వేలు చూపిస్తూ ఆమంచిని నిలదీశారు. ‘గ్యాంగ్‌ను పంపించావు, కొట్టించావు!’ గందరగోళం సృష్టించి, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సమాధాన పర్చేందుకు ఆమంచి ప్రయత్నించినప్పటికీ వినిపించుకోకుండా అంతా నువ్వే చేశావంటూ ఆరోపించారు. మోపిదేవి వెంకటరమణ వారికి సర్దిచెప్పారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చి శాంతపరిచారు. తరువాత కఠారివారిపాలెం వెళ్లి అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. త్వరలో ఇరుగ్రామాల పెద్దలు, ముఖ్యులతో ఒకేచోట సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని అప్పటి వరకు శాంతియుతంగా మెలగాలని సూచించారు. సీఎం జగన్ ఆదేశాలతో వచ్చానని, ఆయన మనకు అండగా ఉంటారని చెప్పారు. మోపిదేవి వెంట ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, డాక్టర్ వరికూటి అమృతపాణి, కరణం వెంకటేష్ తదితరులు ఉన్నారు.
ఐటీసీ అతిథి గృహంలో అధికారులతో మోపిదేవి సమీక్ష
చీరాల ఐటీసీ అతిథి గృహంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బల్ల వల, ఐలా వలపై సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, ఏఎఫ్‌సీవోఎఫ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో ప్రభాకరరెడ్డిలతో వలల వినియోగంలో నెలకొన్న సమస్య, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యను మత్స్యశాఖ కమిషనర్, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలో మత్స్యశాఖ ఏడీ రంగనాథబాబు, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, రూరల్ సీఐ రోశయ్య, స్పెషల్‌బ్రాంచ్ సీఐ సూర్యనారాయణ, తహసీల్దార్ మహ్మద్ హుస్సేన్, ఎఫ్‌డీవో లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T06:17:00+05:30 IST