భూసమస్యలపై ప్రత్యేక సమావేశం
ABN, First Publish Date - 2020-11-14T02:49:48+05:30
భూసమస్యలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు.
కలెక్టర్ పోలా భాస్కర్
రాచర్ల, నవంబరు 13 : మండలంలో భూసమస్యలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. శుక్రవారం రాచర్ల సచివాలయం-1, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేస్తున్న సమయంలో రాచర్ల మండలంలో భూ ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందాయి. జే.పీ.చెరువు గ్రామానికి చెందిన పరదేశి నాయుడు, చినగానిపల్లెలో ఎస్సీలకు సంబంధించి 60 ఎకరాల భూములను కర్నూలు జిల్లా వారు తమది అంటూ అడ్డుపడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. అలాగే ఆకవీడు, సోమిదేవిపల్లి గ్రామాలలో భూసమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఒకరి భూములు మరొకరు ఆన్‌లైన్ చేసుకుంటున్నారని, ఈ రెండు గ్రామాలలో కొంతమంది అధికారులే వందల ఎకరాలు గుంటూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులకు గతంలో కట్టబెట్టారని కలెక్టర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రాచర్ల మండలంలో భూ ఆక్రమణలు ఎక్కువగా ఉన్న విషయం తనకు తెలుసని, ఈ ప్రాంతంలో ఉన్న భూసమస్యలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక రోజు రాచర్ల తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజాసమస్యలపై సచివాలయంకు వచ్చిన అర్జీలను ప్రభుత్వం విధించిన గడువు లోగా పరిష్కరించే బాధ్యత సచివాలయ సిబ్బందిదే అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్‌కార్డులు అర్హులైన వారికి వెంటనే మంజూరు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మార్కాపురం ఆర్‌డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ జయపాల్, ఎంపీడీవో సయ్యద్ మస్తాన్‌వలి పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T02:49:48+05:30 IST