రైతు సమస్యలే అజెండా
ABN, First Publish Date - 2020-12-29T06:33:18+05:30
రైతు సమస్యలే అజెండాగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను విపక్షాలు ముమ్మరం చేశాయి.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విపక్షాల ఒత్తిడి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు
రైతుల కోసం పేరుతో గ్రామాలకు టీడీపీ
నేడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన
నివర్ సహాయం కోసం ఒంగోలులో జనసేన ఆందోళన
ఒంగోలు, డిసెంబరు 28 (అంధ్రజ్యోతి) : రైతు సమస్యలే అజెండాగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను విపక్షాలు ముమ్మరం చేశాయి. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు, ప్రజాసంఘాలు, వామపక్షాలు చేపట్టిన నిరవధిక ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతుల కోసం పేరుతో టీడీపీ జనం బాట పట్టింది. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇంకోవైపు నివర్ తుఫాన్ బాధితులకు తక్షణ సహాయం కోరుతూ జనసేన ఆందోళనలు చేపట్టింది. కేంద్రప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలు సోమవారం కూడా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా దీక్షా శిబిరాలను నిర్వహించారు. అలాగే నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణ పరిహారం కోరుతూ జనసేన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్ నేతృత్వంలో ఒంగోలులో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించారు.
రైతుల కోసం టీడీపీ
రైతుల పట్ల రాష్ట్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతు కోసం పేరుతో టీడీపీ మూడురోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతు కుటుంబాల పరామర్శ, పంట నష్టపోయిన వారికి ఓదార్పు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా పోరాటం చేయడం వంటి కార్యక్రమాలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం కొరిశపాడు మండలం పి.గుడిపాడులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించి ఓదార్చారు. ఇంకొల్లు మండలం హనుమోజీపాలెంలో వీరాంజనేయులు అనే రైతు కుటుంబాన్ని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య పరామర్శించారు. మరోవైపు రైతు కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం లోకేష్ జిల్లాలో పర్యటించను న్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు వచ్చే లోకేష్ త్రిపురాంతకం, దోర్నాల మండలాల్లోని మేడపి, యడవల్లిల్లో పర్యటించి రైతులతో రచ్చబండ నిర్వహించడంతోపాటు, పంట నష్టాలను పరిశీలించనున్నారు.
Updated Date - 2020-12-29T06:33:18+05:30 IST