బైక్‌పై స్పీడ్‌గా వెళ్తున్న యువకుడిని ఆపి.. స్లోగా వెళ్లమని చెప్పినందుకు..
ABN, First Publish Date - 2020-12-28T20:52:52+05:30
మోటారు సైకిల్‌పై నెమ్మదిగా వెళ్లమన్నందుకే ఓ వ్యక్తిని టంగుటూరు బీసీ కాలనీలో ఇటీవల దారుణంగా హత్య చేశారని, ఇందుకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ చెప్పారు.
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
నెమ్మదిగా వెళ్లమన్నందుకే చంపేశాడు
పరారీలో ఐదుగురు స్నేహితులు
ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వెల్లడి
ఒంగోలు(క్రైం): మోటారు సైకిల్‌పై నెమ్మదిగా వెళ్లమన్నందుకే ఓ వ్యక్తిని టంగుటూరు బీసీ కాలనీలో ఇటీవల దారుణంగా హత్య చేశారని, ఇందుకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ చెప్పారు. ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. టంగుటూరు మండలం బుచ్చిరాజుపాలేనికి చెందిన కాకుమాను వంశీ అనే యువకుడు జులాయిగా తిరుగుతుంటాడు. ఈ నెల 22న ఆయన తన స్నేహితుడు ధనేష్ మోటారుసైకిల్ తీసుకుని టంగుటూరు బీసీ కాలనీలో పదేపదే హారన్ కొడుతూ అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాడు. అక్కడ ఉన్న గడ్డం తిరుపతయ్య, గడ్డం సుబ్బారావు మోటారుసైకిల్‌పై వెళుతున్న వంశీని ఆపి నెమ్మదిగా వెళ్లాలని, చిన్నపిల్లలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని చెప్పారు. ఆ విషయంలో వంశీ వారిరువురితో గొడవకు దిగాడు.
ఈ సందర్భంగా తిరుపతయ్యపై తిరగబడిన వంశీ ‘నీ అంతు చూస్తా.. నిన్ను చంపేస్తా’ అని చాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్లాడు. అక్కడ జరిగిన విషయాన్ని తన స్నేహితులైన నరేంద్ర, సాగర్, శ్రీనివాస్, ఆది, అభిలకు తెలిపాడు. దీంతో వారందరూ కలిసి తిరుపతయ్య ఇంటికి రాత్రి ఎనిమిదిగంటల సమయంలో వెళ్లి అతనిపై దాడి చేశారు. వంశీ కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైన తిరుపతయ్యను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 9:20 గంటలకు మృతి చెందాడు. ఈ ఘటన తరవాత నిందితులు పరారయ్యారు. ఈ క్రమంలో నిందితుడు వంశీ ఈ నెల 26న మోటార్‌సైకిల్‌పై నెల్లూరు వైపు నుంచి టంగుటూరు వస్తుండగా సింగరాయకొండ సీఐ కె.శ్రీనివాసరావు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు వినియోగించిన కత్తిని, అతను ఆరోజు వేసుకున్న దుస్తులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారని డీఎస్పీ చెప్పారు. అలాగే నిందితుడి స్నేహితులు నరేంద్ర, సాగర్, శ్రీనివాస్, ఆది, అభిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ కె.శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్‌ఐ నయాబ్‌రసూల్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-28T20:52:52+05:30 IST