‘నాన్న లే, అమ్మా లే.. మీరు లేకుండా మేం ఏమైపోవాలి’
ABN, First Publish Date - 2020-09-14T10:10:09+05:30
అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు బలన్మరణానికి పాల్పడ్డారు.
ఉసురు తీసిన అప్పులు
రుణదాతల ఒత్తిడి తాళలేక భార్యాభర్తల బలవన్మరణం
కట్టావారిపాలెంలో విషాదం..
అనాథలైన ఇద్దరు కుమార్తెలు
కట్టావారిపాలెం(కొండపి)/ప్రకాశం: పరిస్థితులు పగబట్టి కాటేశాయి.. దెబ్బ మీద దెబ్బ తీశాయి.. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి.. వ్యాపారాల్లో అప్పులే మిగిలాయి. దీనికితోడు కరోనాలో లాక్‌డౌన్ ప్రభావం మరింత కుంగదీసింది. తొలుత భర్త ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందగా, అది చూసి భార్య కూడా విషం తీసుకుని చనిపోయింది. దీంతో వారి కుమార్తెలిద్దరూ అనాథలయ్యారు. ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి నాన్న వేలాడుతూ, అమ్మ నురగలు కక్కుతూ చలనం లేకుండా ఉండడాన్ని చూసి ఆ లేత హృదయాలకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కాసేపు నోట వెంట మాట కూడా పెగల్లేదు. నాన్న లే, అమ్మా లే.. మీరు లేకుండా మేం ఏమైపోవాలి అంటూ వెక్కివెక్కి ఏడుస్తుండడం అందర్నీ కలిచివేసింది.
అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారంరాత్రి కొండపి పం చాయతీలోని కట్టావారిపాలెంలో జరిగింది. పోలీసులు, గ్రామస్థుల సమాచారం మేరకు.. కట్టావారిపాలేనికి చెందిన చుండూరి సతీష్(40) దశాబ్దకాలంగా సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డుల విక్రయ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొండపిలో కొంతకాలం షాపు నిర్వహించాడు. వ్యాపారంలో నష్టాలు వస్తూ అప్పులపాలయ్యాడు. తాజాగా లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక రెండు నెలల క్రితం చీమకుర్తిలో బంధువుల సాయంతో మెడికల్‌షాపు పెట్టాడు. కట్టావారిపాలెం నుంచి రోజూ చీమకుర్తి వెళ్లి వస్తున్నాడు. అక్కడ కూడా వ్యాపారం సాగడం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో మనోవేదనకు గురయ్యాడు.
శుక్రవారం రాత్రి పిల్లలు నిద్రించాక ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన చూసిన అత ని భార్య ప్రసన్న కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉద యం ఎస్సై వి.రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు మృతదేహాలను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్సై రాంబాబు తెలిపారు. సతీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి సాయి చందనకు 13 ఏళ్లు కాగా, చిన్నమ్మాయి గీతికకు 11 ఏళ్లు. అమ్మానాన్నలిద్దరూ బలవన్మరణం చెందడంతో ఇద్దరూ అనాథలుగా మిగిలారు. సతీ్‌షకు ఒక సోదరి ఉండగా, భార్య తరపున బంధువులు ఉన్నారు.
Updated Date - 2020-09-14T10:10:09+05:30 IST