కరోనాకు పారాసిటమల్ చాలు
ABN, First Publish Date - 2020-03-16T08:44:49+05:30
కరోనా వైర్‌సపై ‘ప్యానిక్’ (భయాందోళనలు) బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దానికి పారాసిటమల్ మాత్ర వేసుకున్నా సరిపోతుందని.. ఇంట్లో ఉంటూనే వైద్యం చేయించుకోవచ్చని
- 60 ఏళ్లుపైబడినవారిపైనే ప్రభావం
- సీఎం జగన్ వ్యాఖ్యలు
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సపై ‘ప్యానిక్’ (భయాందోళనలు) బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దానికి పారాసిటమల్ మాత్ర వేసుకున్నా సరిపోతుందని.. ఇంట్లో ఉంటూనే వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 60 ఏళ్ల వయసు పైబడినవారికి, డయాబెటిక్, బీపీ, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కరోనా వస్తే కొంత ప్రభావం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రపంచం మొత్తమ్మీద కేసుల్లో 81.9 శాతం ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారని.. 13 శాతానికి ఆస్పత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. కేవలం 4.7 శాతానికే ఐసీయూలో చికిత్స జరుగుతోందన్నారు. ఎవరికీ ఇబ్బందులు ఉండకూడదనే ప్రభుత్వ తాపత్రయమన్నారు. విదేశాల్లో పనిచేసుకునే రాష్ట్రానికి చెందిన వారిని వెనక్కు పంపుతున్నారన్నారు. వారికి ఎయిర్‌పోర్టుల్లో స్ర్కీనింగ్ నిర్వహించి.. 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచుతామని.. అవసరమైన వారందరికీ ప్రభుత్వం వైద్యం చేయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 70 శాంపిళ్లను పంపితే ఒకే కేసులో పాజిటివ్ వచ్చిందన్నారు. గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ తిరిగి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
Updated Date - 2020-03-16T08:44:49+05:30 IST