మా ఎన్నిక.. మా ఇష్టం!
ABN, First Publish Date - 2020-12-05T07:53:05+05:30
కారణాలు, పరిస్థితులు ఏవైనా సరే... స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అధికారం పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దే.
రాష్ట్ర ప్రభుత్వ ‘సొంత రాజ్యాంగం’
ఎస్‌ఈసీని డమ్మీ చేసే యత్నం!.. ‘స్థానికం’పై అసెంబ్లీలో తీర్మానం
ప్రభుత్వ అంగీకారంతోనే పోలింగ్ తేదీలు.. పీఆర్ చట్టానికి సవరణలు
రాజ్యాంగం, సుప్రీం తీర్పునకు విరుద్ధంగా అడుగులు
‘కన్సల్ట్’ నుంచి ‘కాంకరెన్స్’ వైపు.. ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం
మేం చెప్పినపుడే ఓటు..
‘మా రాజ్యం! మాదే రాజ్యాంగం! మేమే కోర్టు. మాదే తీర్పు’... వైసీపీ సర్కారు తీరు ఇది! రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను డమ్మీ చేసేసి.... ‘మేం చెప్పినప్పుడే ఎన్నికలు పెట్టాలి’ అని శాసించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజ్యాంగ నిబంధనలు అంగీకరించకపోయినా, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమైనా సరే... అంతా మా ఇష్టం అనే రీతిలో ముందుకు సాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్‌ఈసీగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని భావిస్తున్న సర్కారు... ‘కరోనా’ సాకుతో శుక్రవారం ఏకంగా శాసనసభలో ఒక తీర్మానం చేసింది. ఎస్‌ఈసీ భావిస్తున్నట్లుగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కుదరదంటూనే... ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో నిర్ణయించే అధికారాన్ని సొంతం చేసుకుంటూ, ఏపీ పంచాయతీరాజ్ చట్టం, 1994కు తగిన సవరణలు చేయాలని తీర్మానించింది. ఈ తీర్మానం ఆధారంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే... ఎస్‌ఈసీ స్వయంప్రతిపత్తిని కోల్పోయి డమ్మీగా మారిపోవడం ఖాయం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి):కారణాలు, పరిస్థితులు ఏవైనా సరే... స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అధికారం పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దే. రాజ్యాంగంతోపాటు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. 1980లలో దేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేది. ఆ తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో భారీ సంస్కరణలు తెచ్చారు. రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణలు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరిపి తీరాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ తరహాలో... రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు... స్వయంప్రత్తిపత్తి, రాజ్యాంగ హోదా కలిగిన ఎస్‌ఈసీని ఏర్పాటు చేయాలి. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ... ఎన్నికలు ఎప్పుడు, ఎన్ని రోజులు నిర్వహించాలనే నిర్ణయాధికారం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దే అని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. రాజ్యాంగంలోని 243(కే) అధికరణలో ఎస్‌ఈసీ విధులు, అధికారాల గురించి స్పష్టంగా వివరించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీకి ఉంటాయి. కానీ ఇప్పుడు నిమ్మగడ్డతో ఉన్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనాను సాకుగా చూపిస్తూ, ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారాన్ని కూడా చేజిక్కించుకోవాలని భావిస్తుండటం గమనార్హం.
సుప్రీం తీర్పునకూ విరుద్ధం
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఎన్నికల నిర్వహణ అధికారం ఎస్‌ఈసీదే అని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదని తేల్చిచెప్పింది. ఇటీవల ఎస్‌ఈసీకి, రాష్ట్రప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంలోనూ ఎన్నికల తేదీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి(కన్సల్ట్)’ అని మాత్రమే సుప్రీంకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది. అంతేతప్ప... రాష్ట్రప్రభుత్వ అంగీకారం(కాంకరెన్స్) మేరకే తేదీలు నిర్ణయించాలని చెప్పలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దీనికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ అంశంపై సీఎస్‌కు ఇప్పటికే లేఖ రాశారు. ‘కన్సల్ట్ వేరు, కాంకరెన్స్ వేరు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అధికారం ఎస్‌ఈసీదే’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు తమ అనుమతితోనే ఎన్నికల తేదీలు ప్రకటించాలనేలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు సిద్ధమవుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం గమనార్హం. తీర్మానంలో మొదట ‘కన్సల్టేషన్’ పదాన్నే ఉపయోగించినప్పటికీ... చివరికి వచ్చేసరికి పరోక్షంగా ‘కాంకరెన్స్’ వైపు కదిలారు.
తెలంగాణ సాకు...
‘‘రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం మేరకే స్థానిక ఎన్నికల తేదీలను ఎస్‌ఈసీ ప్రకటించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 197(6) నిబంధన చెబుతోంది. కానీ, ఏపీలో అలాంటి వెసులుబాటు లేదు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా... ఎస్‌ఈసీ ఏకపక్షంగా వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో చేశారు కాబట్టి... ఇక్కడా చేయొచ్చనే వాదనే సరికాదని అధికారులేచెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సొంతంగా కల్పించుకున్న వెసులుబాటు రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చెల్లదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అక్కడ కొందరు కోర్టుకెళ్లారు.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయించిందని, ఆ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది. అయితే, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో ధర్మాసనం ఆదేశించినందున... ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపరాదన్న పట్టుదలతోనే ఇప్పుడు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతోపాటు ఏపీలో కొవిడ్ వ్యాప్తి ఉంది. సెకండ్‌వేవ్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు 5లక్షల మంది ఉద్యోగులు అవసరం. వీరిలో అత్యధికులు ఇప్పుడు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీచేసే అవకాశముందని తెలుస్తోంది. అది చెల్లుబాటు అవుతుందా, లేదా అనే సంగతి పక్కనపెడితే... నిమ్మగడ్డ పదవీకాలం (వచ్చే మార్చి 31) ముగిసేదాకా ఎన్నికలు నిర్వహించకుండా కాలం గడిపేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని ‘సృష్టించుకుందని’ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలు...
‘‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోంది. దీంతోపాటు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికి వీలుగా పంచాయతీరాజ్ చట్టంలో తగిన నిబంధనలు చేర్చాలని తీర్మానించడమైనది’ అంటూ శుక్రవారం అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించారు. ఇందులో పేర్కొన్న మరిన్ని ముఖ్యాంశాలు ఇవి...
కరోనా వ్యాప్తిలో రెండోదశ నడుస్తోంది. చలికాలంలో కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అడ్వాన్స్‌డ్ మందుల కొరత ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 7,014 మంది మరణించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన మంచిది కాదని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. కరోనాకు భయపడి ప్రాణభయంతో ప్రజలు ఓటేయడానికి రాకపోతే, తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే ప్రాథమిక హక్కుకే భంగం కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుతెస్తుంది. ఇలాంటి ఎన్నికల్లో గెలిచిన వారు నిజమైన ప్రజాప్రతినిధులే కారు.
రాజ్యాంగ సంస్థలు పరస్పరం గౌరవించుకోవాలి. ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి ఉమ్మడి బాధ్యత ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ తన ప్రత్యర్థిగా భావించకూడదు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఎన్నికల నిర్వహణపై ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు. బిహార్‌తో పోలిస్తే 8రెట్లు, రాజస్ధాన్‌తో పోలిస్తే ఆరు రెట్లపైనే ఏపీలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దామని, ఎన్నికలు నిర్వహించి మళ్లీ పాడు చేయవద్దని కరోనా వారియర్స్ కోరుతున్నారు. కరోనా తీవ్రత తగ్గేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరు.
‘ఆర్డినెన్స్’పై గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ?
శుక్రవారం అసెంబ్లీలో జారీ చేసిన తీర్మానం ఆధారంగా ఆర్డినెన్స్ జారీ చేసి... ఎస్‌ఈసీ అధికారాలను, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే అవకాశముందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కేవలం తనను అర్ధంతరంగా పదవి నుంచి తొలగించేందుకు అడ్డదిడ్డంగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారని, చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో తననే పదవిలో నియమించక తప్పలేదని ఈ లేఖలో గుర్తుచేసే అవకాశముంది. ప్రభుత్వ అంగీకారం మేరకే ఎన్నికల తేదీలు ప్రకటించాలనే ఆర్డినెన్స్ జారీ చేస్తే... దానిని ఆమోదించవద్దని కోరనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించి... స్వయంగా సంతృప్తి చెందితేగానీ ఆర్డినెన్స్‌పై సంతకం చేయరాదని గవర్నర్‌ను కోరే అవకాశముంది.
Updated Date - 2020-12-05T07:53:05+05:30 IST