‘కరోనా’లోనూ పెరిగిన నేరాలు
ABN, First Publish Date - 2020-12-30T04:49:15+05:30
2020... బహుశా ఈ సంవత్సరాన్ని ఎవరూ మరువలేరు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది.
మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు
సంచలనం రేపిన హత్యలు
నూతన మద్యం పాలసీ.. బ్లాక్‌లో వైన్!
ఇసుక రాయుళ్లూ పేట్రేగారు!
కరోనాతో సైనికుల్లా పని చేసిన పోలీసులు
ఏడాదంతా కరోనా.. అర్ధ సంవత్సరానికిపైగా ప్రజలంతా గుమ్మం దాటి బయటకు రాలేదు. ఇంకేముంది.. క్రైం రేటు బాగా తగ్గి ఉంటుందని భావించకండి. 2020... ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సంచలనం రేపే హత్యలు.. చిన్నారులపై మృగాల వికృత చేష్టలు.. లైంగిక దాడులు... బలవన్మరణాలు... రోడ్డు ప్రమాదాలు.. దొంగతనాలు.. గుట్కా, ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణా, గొలుసుకట్టులు, చీటీల పేరుతో మోసాలు, పేకాట నిర్వహణ, క్రికెట్ బెట్టింగ్ ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఈ సంవత్సర డెయిరీలో నమోదయ్యాయి.
నెల్లూరు,(క్రైం) డిసెంబరు 29 : 2020... బహుశా ఈ సంవత్సరాన్ని ఎవరూ మరువలేరు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది. లాక్‌డౌన్ కాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. అయితే క్రైం రేటు మాత్రం తగ్గలేదు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా నెల్లూరు నగరంలో హత్యలు, రౌడీయిజం, సెటిల్‌మెంట్లు, వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక నూతన మద్యం పాలసీతో జిల్లాలో బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తమిళనాడు, బెంగుళూరు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనధికార మద్యం ఏరులైపారింది. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. ఎస్‌ఈబీ అధికారులు ఈ ఏడాదంతా మద్యం, ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై వేల కేసులు నమోదు చేస్తూన్నా కేసుల సంఖ్య మాత్రం తరగలేదు. ఏది ఏమైనా జిల్లాలో నేర సంస్కృతి ఈ ఏడాది చాప కింద నీరులా ప్రవహించింది. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ పోలీసులు విధులు నిర్వహించారు. కరోనా విఽధుల్లో వందల మంది మహమ్మారి బారిన పడగా, ఇద్దరు పోలీసులు కోలుకోలేక మృతి చెందారు. దారితప్పారన్న నెపంతో పలువురు పోలీసులను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక పోలీసుల వ్యవహారశైలి సమాజంలో చిన్నబోయేలా ఉండే సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఎన్నడూలేని విధంగా పోటెత్తిన వరదలో అగ్నిమాపక దళం అందించిన సేవలు అభినందనీయం. అయితే, ఫైర్ సర్టిఫికెట్ల మంజూరులో భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. లాక్‌డౌన్ కారణంగా రైలు ప్రమాదాలు బాగానే తగ్గాయి. విజిలెన్స్ అధికారులు ఈ ఏడాది మొదటి నుంచి అనేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా విదిల్చారు. ఏసీబీ అధికారులు సైతం పెద్ద పెద్ద అధికారులను జైళ్లకు పంపారు. ఈ ఏడాది మొదట్లోనే నగరంలోని చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలో 2013 సంవత్సరంలో తల్లీకూతురుళ్లను హత్య చేసిన హంతకుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించి సంచలన తీర్పు వెలువరించింది.
నేరాల్లో ప్రధానంగా..
జనవరి 1వ తేదీ తూపిలిపాళెం బీచ్‌లో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిరుపతికి చెందిన ఈ ముగ్గురు ఇంట్లో దైవ దర్శనానికని బయలుదేరి తూపిలిపాళెం బీచ్‌లో మునుగుతూ మృతి చెందారు.
గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో 1.32 కోట్ల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
మతిస్థిమితం లేని యువతిపై గూడూరు మండలం చౌటపాళెం ప్రాంతంలో పలువురు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు రోజుల్లోనే పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా పాతనేరస్థులే.
2013లో బంగారం, డబ్బు దొంగతనానికి వచ్చి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ఫిబ్రవరి ఆరో తేదీ 8వ అదనపు మహిళా కోర్టు జిల్లా సెక్షన్స్ జడ్జి డాక్టర్ డొక్కా సత్యనారాయణ హంతకుడికి ఉరిశిక్ష విధించారు.
ఫిబ్రవరి 22న కోట మండలం ఊనుగుంటపాళెంలోని ధనుంజయరెడ్డి గిరిజన కాలనీలో ఓ మహిళ తన ఇద్దరి పిల్లల్ని ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేయడంతోపాటు ఆమె ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
లబ్ధిదారులకి అందాల్సిన రేషన్ బియ్యం శనివారం రాత్రి కృష్ణపట్నం పోర్టులో ఏకంగా 32,960 బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఇతర దేశాలకు తరలి వెళుతాయని గుర్తించారు.
మార్చి 18వ తేదీన కావలి మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీర్ బాషా ఒక లక్ష నగదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పేకాట నిర్వహణ యజమాని పోలీసుల పాత్ర ఉందని విచారణలో అంగీకరించడంతో పలువురు పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఓ మహిళ ఎస్‌ఐ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధంపై జరిగిన రచ్చ పెద్ద చర్చగా మారింది. ఈ ఏడాది పలువురు సిబ్బందిని వీఆర్ కి పంపడంతోపాటు సస్పెండ్ చేయడం పోలీసు శాఖతోపాటు సమాజంలో పోలీసుల తీరు పట్ల వ్యతిరేకత వచ్చింది.
దిశ పోలీసు స్టేషన్‌ను జిల్లాలో ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ ఏర్పాటు అయిన తరువాత ఫోక్సో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. చిన్నారుల పట్ల కీచకుల వేధింపులు అధికమయ్యాయి.
ఈ ఏడాదిలో కేసులు..
2019లో 6,744 కేసులు నమోదు కాగా, 2020లో 13,368 కేసులు నమోదయ్యాయి. 2019లో 4.73 కోట్లు ప్రాపర్టీ రికవరీ చేయగా, 2020లో 3.59 కోట్లు సొత్తు రికవరీ చేశారు. అయితే 2020లో అపహరణకు గురైన సొత్తు విలువ తక్కువే.
ట్రాఫిక్‌లో 2018లో ఎంవీ యాక్టు కింద 2,35,978 కేసులు నమోదు చేయగా, 2019లో 2,25,941 కేసులు నమోదు కాగా, 2020లో ఏకంగా 5,41,723 కేసులు నమోదు చేశారు. వీటిలో గత ఏడాది డంక్ అండ్ డ్రైవ్ లో 10,822 కేసులు ఉండగా, ఈ ఏడాది కరోనాతో 799 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఇసుక అక్రమ రవాణా కేసుల్లో గత ఏడాది 94 ఉండగా, ఈ ఏడాది 510కి చేరాయి. 665 వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఐదు డంప్‌లను, 1073 మందిని అరెస్టు చేశారు. గుట్కాకు సంబంధించి 77 కేసులు నమోదు చేయగా, 167 మందిని అరెస్టు చేసి 4.18 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 21 గంజాయి కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్టు చేయడంతోపాటు 12 వాహనాలను, 498.530 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎస్‌ఈబీ తనిఖీల్లో ఇసుక అక్రమ రవాణాపై 441 కేసులు నమోదు చేయగా, 877 మందిని అరెస్టు చేశారు. 557 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 4,886 టన్నుల ఇసుకను సీజ్ చేశారు.
Updated Date - 2020-12-30T04:49:15+05:30 IST