నిండిన చెరువులు.. పొంగిన వాగులు
ABN, First Publish Date - 2020-11-14T02:57:46+05:30
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో జలకళ సంతరించుకోగా, వాగులు పొంగి పోర్లుతున్నాయి.
పలు గ్రామాలకు రాకపోకల బంద్
నెల్లూరులో మోస్తరు వర్షం
జలదంకి, నవంబరు 13 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో జలకళ సంతరించుకోగా, వాగులు పొంగి పోర్లుతున్నాయి. జలదంకి మండలంలో చెరువుల కలుజులు పారుతున్నాయి. చినక్రాక, దాసరి అగ్రహారం, కమ్మవారిపాలెం, చామదల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగక ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధానంగా చినక్రాక వద్ద చీకటివాగు, దాసరి అగ్రహారం వద్ద ఉత్తరపు వాగు, చామదల, కమ్మవారిపాలెం గ్రామాల మీదుగా ప్రవహించే నేరెళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలకు బయటప్రాంతాలతో సంబంధాలు తెగుతున్నాయి.
కలిగిరి : పెద్ద చెరువు అలుగు కాలువకు శుక్రవారం గండిపడటంతో వర్షపునీరంతా సోమశిల ఉత్తరకాలువలోకి చేరింది. కాలువకు గండిపడటంతో చెరువులోకి నీరు రావడం ఆగిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సోమశిల కాలువ అధికారులు కాలువను పరిశీలించి, వర్షాలు తగ్గాక గండిపూడ్చటానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలిగిరి-కొండాపురం రహదారిపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
బిట్రగుంట : మండలంలో చెరువులు నిండి కలుజులు పారడంతో కాలువలు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాలెం గిరిజన కాలనీ, కొండబిట్రగుంట గిరిజన కాలనీ, తిప్ప, రామాపురం, చెంచులక్ష్మీపురం, చెన్నారెడ్డి పాలెం, ఎస్వీపాలెం వెంకటేశ్వరపాలెంలో ఇళ్లలోకి నీరు చేరింది. జాతీయ రహదారి, ముంగమూరు మధ్య ప్రమాకరంగా ఉన్న రెండో వంతెన పూర్తిగా జలమయం కావడంతో మాజీ ఉప సర్పంచు రాయి వినోద్ యాదవ్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో పార్థసారథి, తలారులు గ్రామస్థుల సహకారంతో రాకపోకలు లేకుండా ఇరువైపులా కంప చెట్లు వేశారు. తహసీల్దారు బాలమురళీకృష్ణ ముంపునకు గురైనా ప్రాంతాలో పర్యటించి వర్షపు నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వైసీపీ మండల కన్వీనర్ రఘు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు పరిస్థితిని కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో పంచాయతీ కార్యదర్శి నాగేంద్రకుమార్ యంత్రాలతో వర్షపు నీరు వెళ్లేలా పనులు చేపట్టారు.
జిల్లాలో సగటు వర్షపాతం 30.9 మిమీ
నెల్లూరు (హరనాథపురం) : జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం 30.9మిమీగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా జలదంకిలో 99.2మిమీ, అత్యల్పంగా వెంకటాచలంలో 3.2 మిమీ వర్షం కురిసింది.
Updated Date - 2020-11-14T02:57:46+05:30 IST