రైలు బండి.. రైలు బండి.. ఇప్పట్లో రాదులెండి!
ABN, First Publish Date - 2020-10-03T21:03:11+05:30
చుట్టూ నిలువెత్తు కొండలు... దట్టమైన అడవులు.. వర్షాకాలంలో జాలువారే జలపాతాలు.. పక్షుల కిలకిలరావాలు.. అటవీ పూల మరిమళాలు.. వన్యప్రాణుల సందళ్లు.. ఇవన్నీ వెలుగొండల సొంతం. మనసును ఎంతో ఆహ్లాద పరిచే అలాంటి
కొండ, కోన, దట్టమైన అడవుల్లో కూ చుక్.. చుక్..
ఇప్పటికే గూడ్సు రైళ్ల పరుగు
ప్యాసింజర్ రైళ్లకు పడని గ్రీన్‌సిగ్నల్
మార్చిదాకా ఆగాల్సిందేనంటున్న రైల్వే వర్గాలు
మెట్టవాసుల స్వప్నం ఎప్పటికి నెరవేరేనో!?
ప్రాజెక్టు పేరు: కృష్ణపట్నం - ఓబులువారిపల్లి రైల్వేలైన్
లైన్ నిర్మాణానికి అనుమతి : 2006
వ్యయం : రూ.2000కోట్లపైనే..
పొడవు : 113 కి.మీ
పూర్తయ్యింది : 106 కి.మీ
సొరంగ మార్గం : 7.5 కి.మీ
రైల్వేస్టేషన్లు : 6
ప్రారంభం : 2019, ఫిబ్రవరి 2019
గూడ్సు రైలు నడిచింది : 2019, జూన్
రాపూరు/నెల్లూరు(ఆంధ్రజ్యోతి): చుట్టూ నిలువెత్తు కొండలు... దట్టమైన అడవులు.. వర్షాకాలంలో జాలువారే జలపాతాలు.. పక్షుల కిలకిలరావాలు.. అటవీ పూల మరిమళాలు.. వన్యప్రాణుల సందళ్లు.. ఇవన్నీ వెలుగొండల సొంతం. మనసును ఎంతో ఆహ్లాద పరిచే అలాంటి కొండల్లో రైలు ప్రయాణమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక జిల్లా పడమర మెట్టప్రాంత వాసుల చిరకాల స్వప్నం రైలు ప్రయాణం.
మరో అద్భుతం..
దేశంలోనే రైల్వేగేటు లేని లైన్ వెంకటాచలం- ఓబులవారిపల్లి రైల్వే లైన్ ఇది. తొలి ఎలక్ట్రికల్ సొరంగ మార్గం కూడా ఇదే. పట్టాల నిర్మాణం పూర్తయి ఇప్పటికే గూడ్సు రైళ్లు పరుగులు తీస్తున్నాయి.
అయితే..
ఇంత అద్భుతమైన పట్టాలపై ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించే అవకాశం జిల్లావాసులు ఇంకా నోచుకోలేదు. కృష్ణపట్నం పోర్టు నుంచి కడప జిల్లా ఓబులువారిపల్లి వరకూ లైన్ నిర్మాణం పూర్తయి గూడ్సు రైళ్లు తిరుగుతున్నాయి. అయితే, ప్రజా రవాణా మాత్రం ప్రకటనలకే పరిమితమతుంది. కూ చుక్ చుక్ రైలు కూత చెవికి వినసొంపుగా వినబడుతోందేతప్ప రైలెక్కి ప్రయాణించే భాగ్యం దక్కడం లేదని మెట్టవాసులు ఆవేదన చెందుతున్నారు.
వెంకయ్య స్వప్నం...
వెలుగొండల్లో రైలు కూత పెట్టడం తన స్వప్నమని తరచూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పడమే కాక ఆ స్వప్నాన్ని సాకారం చేసి ఆ రైలు మార్గంలో కుటుంబసభ్యులతో కలసి ప్రయాణించారు. కాగా, 113 కి.మీ పొడవైన ఈ మార్గంలో ఒక్క గేటు కూడా లేకపోవడం విశేషం. ఏకంగా 7 కి.మీ పొడవైన విద్యుద్దీకరణతో ఏర్పాటైన సొరంగమార్గం కావడం మరో విశేషం. తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు ఈ రైలుమార్గం ద్వారా 60 కి.మీ దూరం తగ్గుతుంది. ప్రయాణంలో ఐదు గంటల సమయం ఆదా అవుతుంది.
4 మండలాలకు తొలిసారిగా..
రాపూరు, సైదాపురం, పొదలకూరు, డక్కిలి మండల ప్రజలకు రైలు సౌకర్యం కలిగినట్టు అయ్యింది. అయితే, రైలు పట్టాలు, రైల్వే స్టేషన్లు, రైళ్లు తిరుగుతున్నాయే తప్ప ప్రజారవాణా మాత్రం నేటికీ అమలుకాలేదు. కడప జిల్లాలోని మంగంపేట, చెర్లోపల్లె, నెల్లూరు జిల్లాలోని నవాబుపేట, సంకురాత్రిపల్లె, కుటుమారుపల్లె, కసుమూరులలో అధునాతన సౌకర్యాలతో స్టేషన్లు నిర్మించారు. కొత్తగా రాపూరు సమీపంలో రాపూరు ఎట్ వెలికల్లు పొదలకూరు మండలంలోని వీరంపల్లి గ్రామ సమీపంలోని కట్టుబడిపల్లి వద్ద కొత్త స్టేషన్ నిర్మాణాలు జోరుగా చేపడుతున్నారు.
మార్చిలోనే ప్రజా రవాణా
గతేడాది డిసెంబరులోనే ప్యాసింజరు రైళ్లు నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, కరోనా ప్రభావంతో ప్రజారవాణాకు ఆటంకం కలిగింది. వచ్చే ఏడాది మార్చిలో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన పనులు వేగవతం చేస్తున్నట్లు ఆర్‌వీఎన్‌ఎల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Updated Date - 2020-10-03T21:03:11+05:30 IST