బావిలో పడి ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-11-03T09:39:54+05:30
బావిలో నీళ్లు తోడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..
మేనమామ మృతితో పెళ్లింట విషాదం
కావలి రూరల్, నవంబరు 2: బావిలో నీళ్లు తోడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి పట్టణంలోని వైకుంఠపురంలో నివాసం ఉంటున్న షేక్ నాగూర్‌బాషా (36) పెయింటర్‌గా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగింస్తున్నాడు. అతని అక్క ప్రకాశం జిల్లా పెద్దపవనిలో నివాసం ఉంటుంది. అక్క కుమార్తెకు బుధవారం వివాహం జరుగనుంది. దీంతో పెళ్లి కుమార్తెకు మేనమామ అయిన నాగూరుబాషా కుటుంబ సభ్యులు పెళ్లి పనులు చూసుకునేందుకు సోమవారం పెద్దపవనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో దర్గా పక్కనున్న గిలక బావి నుంచి నీరు తెచ్చేందుకు వెళ్లి బిందెతో నీరు తోడే సమయంలో తాడు తెగి కాలుకు చుట్టుకోవడంతో నాగూర్‌బాషా అదుపుతప్పి బావిలో పడిపోయాడు. నీటి కోసం వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు బావివద్దకు వెళ్లి పరిశీలించి బావిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య నసీమ, ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పెళ్లికుమార్తె మేన మామ నాగూర్‌బాషా మృతి విషయం తెలిసి పెదపవనిలోని ఇంట్లో సైతం విషాదం చోటు చేసుకుంది.
Updated Date - 2020-11-03T09:39:54+05:30 IST