కరోనా వార్డుల పెంపు
ABN, First Publish Date - 2020-03-27T05:38:28+05:30
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందించేలా మార్పు చేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే
కార్యాచరణ దిశగా అధికారులు
ప్రసూతి, చిన్నపిల్లల ఆసుపత్రి వద్ద బారిగేట్లు
ఇన్‌పెషెంట్లను నారాయణకు తరిలించే యత్నం
ఈఎన్‌టీ వార్డు అపోలోకి అప్పగింత
నెల్లూరు (వైద్యం), మార్చి 26 : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందించేలా మార్పు చేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే వారు తగ్గటం, జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో జీజీహెన్‌ను కరోనా ఆసుపత్రిగా మార్చనున్నారు. 750 పడకలు ఉన్న ఈ ఆసుపత్రితోపాటు 250 పడకలు ఉన్న ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో కూడా మార్పులు చేస్తున్నారు. ప్రధాన ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రికి మధ్యలో రాకపోకలు నిషేధించి బారికేట్లను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రసూతి ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 84 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. కొత్తగా డయోగ్నోస్టిక్ బిల్డింగ్‌లో మరో వంద పడకలు క్వారంటైన్ వార్డును ఏర్పాటు చేశారు. జీజీహెచ్ కొత్త బిల్డింగ్ మూడో అంతస్థులో 18 పడకల ఐసీయూ కరోనా వార్డును ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన పడకలను కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద 600కుపైగా పడకల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
నారాయణ ఆసుపత్రికి తరలించే యత్నం
ప్రస్తుతం జీజీహెచ్ ఇన్ పేషెంట్‌లను నారాయణ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా ఆసుపత్రిలో వివిధ వ్యాధులతో 200 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు కోలుకోగా మరి కొంతమందికి చికిత్సలు కొనసాగించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో జీజీహెచ్‌ను కరోనా బాధితులకు కేటాయించాలన్న అధికారు లు నిర్ణయంతో ఉన్న రోగులను నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిచాలన్న ఉద్దేశంలో వైద్యాధికారులు ఆ ధిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈఎన్‌టీ వార్డు అపోలోకు అప్పగింత
జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ వార్డును అపోలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి అప్పగించారు. దీన్ని కరోనా వార్డుగా మార్చి అపోలో వైద్యులు వైద్య సేవలు అందిస్తారు. ఇందులో 30 పడకలను ఏర్పాటు చేసి అపోలో వైద్యులు కరోనా బాధితులకు సేవలు అందిస్తారు. కలెక్టర్ శేషగిరిబాబు చొరవతో అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా తమ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. జీజీహెచ్‌లో వైద్యుల కొరత ఉన్న కారణంగా పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కూడా జీజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలు అందిచేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
జీజీహెచ్ ఐసోలేషన్‌కు మరో ముగ్గురు
నెల్లూరు జీజీహెచ్‌కి గురువారం మరో ముగ్గురు కరోనా అనుమానితులు వచ్చారు. కావలికి చెందిన ఓ యువకుడు సౌదీ నుంచి 25 రోజుల క్రితం వచ్చాడు. అయితే రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడ వైద్యుల సూచనల మేరకు నెల్లూరు జీజీహెచ్‌కు వచ్చారు. పరీక్షించిన వైద్యులు కరోనా అనుమానంతో యువకుడి తల్లిని కూడా తీసుకు వచ్చి కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
కాగా ఇటీవల లండన్ నుంచి నెల్లూరుకు వచ్చిన ఓ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో జీజీహెచ్ వైద్యులు పరిశీలించి నమూనాను తీసి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరితో కలిపి ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 9 మంది ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగికి. రాజుపాళెం నుంచి తీసుకువచ్చిన ఓ మహిళకు కూడా కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్థారించారు. వారిని ఇళ్లకు పంపించేందుకు అధికారులు అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.
1554 మంది విదేశాల నుంచి రాక
విదేశాల నుంచి ఇప్పటి వరకు 1554 మంది జిల్లాకు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారే. వీరందరిని స్వీయ నిర్భంధంలో వారి నివాసాల్లోనే ఉన్నారు. వీరిలో 145 మంది 28 రోజుల కాలపరిమితి కాగా, వారిని స్వీయ నిర్భంధం నుంచి తొలగించారు.
Updated Date - 2020-03-27T05:38:28+05:30 IST