ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంభవృష్టి!

ABN, First Publish Date - 2020-11-13T05:53:55+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో నెల్లూరులో బుధవారం అర్ధరాత్రి కుంభవృష్టిగా వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో మొదలైన వాన అర్ధరాత్రి దాటాక తీవ్రరూపం దాల్చింది.

ట్రంకురోడ్డులో వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 సెం.మీ వర్షం 

రోడ్లన్నీ బ్లాక్‌, అండర్‌ బ్రిడ్జీలు క్లోజ్‌ 

శివారు ప్రాంతాలు జలమయం

స్తంభించిన జనజీవనం


నెల్లూరు (సిటీ), నవంబరు 12 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో నెల్లూరులో బుధవారం అర్ధరాత్రి కుంభవృష్టిగా వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో మొదలైన వాన అర్ధరాత్రి దాటాక తీవ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు విడతల వారీగా కురిసిన భారీ జల్లులతో ఒక్కరోజులో 10 సెం.మీ. (106.2 మి.మీ) వర్షపాతం నమోదైంది. దీంతో నగర జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు, కాలువలు, అండర్‌ బ్రిడ్జిలు నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిని తరలించే కాలువలు ఆక్రమణల వల్ల కుంచించుకుపోవడంతో చుట్టుపక్కలున్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లేఅవుట్‌, ఆత్మకూరు బస్టాండ్‌, విజమ మహాల్‌గేట్‌ అండర్‌ బ్రిడ్జీలు వర్షపు నీటితో నిండిపోయాయి.  రామలింగా పురం వద్దనున్న అండర్‌బ్రిడ్జి మార్గాన్ని రైల్వే వంతెన నిర్మాణం నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. వాహనాల రద్దీ పెరగడంతో మినీ బైపాస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.


ముమ్మరంగా సహాయక చర్యలు 

నగరాన్ని భారీ వర్షం చుట్టుముట్టడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు నేతృత్వంలోని బృందాలు నగరానికి ఇరువైపుల సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ మున్సిపల్‌ యంత్రాంగాన్ని సిద్ధం చేసి కాలువల్లో పూడికతీతతోపాటు, వరద నీరు వేగంగా బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. ఇళ్ల ముందు నిలిచిన నీటిని తరలిస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులకు అధికారులు ఆహారం అందించారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేశారు. ఇటు టీడీపీ నాయకులు కూడా ప్రజలకు తోడుగా నిలవగా మాజీ మేయర్‌ అబ్దుల్‌అజీజ్‌ ఫోన్లో అధికారులకు బాధితుల సమాచారం అందించారు. 


కరెంట్‌కు అంతరాయం 

ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి వర్షం కురవడంతో విద్యుత్‌ శాఖ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కరెంట్‌ సరఫరాను పలు ప్రాంతాల్లో నిలిపివేసింది. శివార్లు, రూరల్‌ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.  దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 


సహాయక చర్యలు ముమ్మరం చేయండి

మంత్రి అనిల్‌

నెల్లూరు(జడ్పీ),  నవంబరు 12 :  భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పందించారు. విజయవాడ నుంచి ఆయన కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మన్సూర్‌నగర్‌, ఖుద్దూస్‌నగర్‌, జనార్దన్‌రెడ్డికాలనీ,  రవీంద్రనగర్‌, ఉమ్మారెడ్డిగుంట, ఆర్టీసీకాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కమిషనర్‌ దినేష్‌ కుమార్‌తోపాటు ఇతర అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.  


చెరువుల్లా శివార్లు 

ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి నగర శివారు ప్రాంతాలు చెరువులుగా మారాయి. బుజబుజ నెల్లూరులోని సమతానగర్‌, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, భాగత్‌సింగ్‌ కాలనీలోని ఏ బ్లాక్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడి ప్రజలను కార్పొరేషన్‌ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. శివగిరి కాలనీ, మన్సూర్‌నగర్‌, పరమేశ్వరీనగర్‌, పడారుపల్లి, లేక్‌వ్యూకాలనీ, అంబాపురం, కావేరినగర్‌, వైఎస్‌ఆర్‌ నగర్‌, నవలాకులతోటలోని కొన్ని ప్రాంతాలు, టెక్కేమిట్ట, వనంతోపు, బీవీనగర్‌, మాగుంటలేఅవుట్‌, ఎస్‌ఆర్‌కే స్కూల్‌, కోడూరుపాడు వద్దనున్న మిక్స్‌డ్‌కాలనీ, పొట్టేపాళెం వద్దనున్న పల్లెపాళెం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో జనజీవనానికి ఆటకం ఏర్పడింది. 


పొలాల నిండా నీళ్లు

భారీ వర్షానికి నెల్లూరు రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలన్నీ నీట మునిగాయి. కాలువలు, వాగులు పొంగడంతో లోతట్టులోని పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. నెల్లూరు - తాటిపర్తి రహదారిలో కొమ్మరపూడి క్రాస్‌రోడ్డు వద్ద పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇదే రహదారి మార్గంలోని సౌత్‌మోపూరు క్రాస్‌ రోడ్డు వద్ద శ్రీరామ గిరిజన కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. కందమూరు గిరిజన కాలనీ ముంపునకు గురైంది. నారుమళ్లకు సిద్ధం చేస్తున్న రైతులు, విత్తనాలు చల్లిన వారు కయ్యలు వానకు మునగడంతో లబోదిబోమంటున్నారు.

Updated Date - 2020-11-13T05:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising