తిరుగుబాటు తథ్యం
ABN, First Publish Date - 2020-12-29T06:47:52+05:30
నివర్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోకుంటే రైతాంగంతో కలిసి ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులను ఆదుకోకుంటే ఉద్యమిస్తాం
ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిక
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పరామర్శ
నివర్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోకుంటే రైతాంగంతో కలిసి ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చల్లపల్లి మండలంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలను సోమవారం లోకేశ్ పరామర్శించారు.
చల్లపల్లి, డిసెంబరు 28 : రైతు ప్రభుత్వం అంటూ రైతులు లేని రాజ్యంగా మార్చుకుంటున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘రైతుల కోసం యాత్ర’లో భాగంగా సోమవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్ ముందుగా
చల్లపల్లి మండలం పాగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, జగన్ రెడ్డి 579 రోజుల పాలనలో 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మంత్రివర్గం స్పందించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తేది కాదన్నారు. కౌలురైతు ఆత్మహత్య చేసుకుని నెలైనా పరిహారం అందించలేదని, ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సులు చూస్తూ బిజీగా ఉన్నారని విమర్శించారు. ్టపరిహారంపై శాసనమండలిలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదన్నారు. లోకేశ్ వెంట మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు కాగిత కృష్ణప్రసాద్, మండలి రాజా, తలశిల స్వర్ణలత, పైడిపాముల కృష్ణకుమారి తదితరులు ఉన్నారు.
కౌలు రైతు కుటుంబాలకు భరోసా
‘అమ్మను జాగ్రత్తగా చూసుకో.. తమ్ముడి చదువు బాధ్యత నేను చూసుకుంటా..’ అంటూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గద్వాల కృష్ణ పెద్ద కుమారునికి లోకేశ్ భరోసా ఇచ్చారు. చల్లపల్లి మండలం చింతలమడకు చెందిన సూదాని సాంబశివరావు కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాగోలులో ఆత్మహత్యకు పాల్పడిన గద్వాల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ పెద్దకుమారుడు సాయిబాబు, తల్లి కనకదుర్గతో నేలపై కూర్చునే మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
Updated Date - 2020-12-29T06:47:52+05:30 IST