ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌ జోన్‌లలో చాలు

ABN, First Publish Date - 2020-04-12T07:55:23+05:30

సంపూర్ణ లాక్‌డౌన్‌ను ‘రెడ్‌ జోన్‌’లకు మాత్రమే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. కరోనా నియంత్రణకు సమర్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మిగిలిన చోట్ల లాక్‌డౌన్‌ ఎత్తివేయాలి
  • ఆర్థిక వ్యవస్థనూ చూడాలి
  • కరోనాపై కేంద్రం చర్యలు భేష్‌
  • రెడ్‌జోన్‌లో 37 మండలాలు
  • ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌

అమరావతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ లాక్‌డౌన్‌ను ‘రెడ్‌ జోన్‌’లకు మాత్రమే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. కరోనా నియంత్రణకు సమర్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ప్రధాని శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. లాక్‌డౌన్‌పై జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘ప్రధానమంత్రిగా మీరు విశాల దృక్పథంతో తీసుకున్న గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను’’ అని అన్నారు. అదే సమయంలో... ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా ముందుకు కదలాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రజల కనీస  అవసరాలకు తగ్గట్టుగానైనా గడవాలన్నదే నా అభిప్రాయం. 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారత దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే... కరోనాపై దీర్ఘకాలం పోరాటం చేయాల్సి ఉంటుంది’’ అని సీఎం చెప్పారు.


రాష్ట్ర స్థాయిలో తాము తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. మూడు వారాల లాక్‌డౌన్‌ మంగళవారం ముగుస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 676 మండలాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ సోకిన 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌లో 44 ఉన్నాయి.  మిగిలిన 595 మండలాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు. లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం. జనం గుమిగూడకుండా మాల్స్‌, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలి’’ అని ప్రధానికి తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రధాని తీసుకుంటున్న చర్యలను దక్షిణాసియాతోపాటు, ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయన్నారు. ‘‘మీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాం. 1.40 కోట్ల కుటుంబాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం సేకరించాం. వారందరి కాంటాక్టుల వివరాలు సేకరించి కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్నవారందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం’’ అని మోదీకి జగన్‌ వివరించారు.  


లాక్‌డౌన్‌తో కష్టాలు... 

సామాన్యులపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాల మధ్య వ్యవసాయోత్పత్తుల రవాణా నిలిచిపోయిందని తెలిపారు. 25 శాతానికి మించి ట్రక్కులు తిరగడం లేదన్నారు. ‘‘రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సరిపడేంత గోదాములు లేవు. మార్కెట్లు నడపకపోవడంతో  ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.  స్థానికంగా వీటిని ఎంత వరకు వినియోగించగలం?  ఇప్పుడున్న పరిస్థితి  కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి.  ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. పారిశ్రామిక రంగం విషయానికి వస్తే... 1,03,986 యూనిట్లకు గాను 7350 మాత్రమే పనిచేస్తున్నాయి. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది’’ అని జగన్‌ వివరించారు. రోడ్డు, రైల్వే రవాణా నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ‘‘పరిశ్రమలు నడవనప్పుడు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని ఎలా ఆశించగలం? రాష్ట్రానికి ఆదాయం రాని పరిస్థితి ఏర్పడింది. వలస కార్మికులు, దినసరి కూలీ లు, వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు’’ అని తెలిపారు.

‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కొవిడ్‌-19 విజృంభణపై హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయానికే రాష్ట్రంలో కరోనా నియంత్రణకు పటిష్ఠ కార్యాచరణతో సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రధానికి జగన్‌ వివరించా రు. ఈ ఏడాది మార్చి 12న రాష్ట్రంలో మొదటి కేసు గుర్తించేనాటికే.. కరోనా వైరస్‌ నియంత్రణకు సన్నద్ధతతో ఉన్నామన్నారు. 


రాష్ట్రానికి ఇవి ఇవ్వండి... 


  1. ఆర్థికపరమైన ఇబ్బందులను కేంద్రం పరిష్కరించాలి.
  2. కరోనా వల్ల ఏర్పడే మాంద్యాన్ని తట్టుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.
  3. 15వ ఆర్థిక సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని నిధులు మంజూరు చేయాలి.
  4. తక్షణమే పది కిలోల బియ్యం, లేదా గోధుమలు, రెండు కిలోల కందిపప్పు, ఒక కి లో వంట నూనె, ఇతర నిత్యావసర సరుకులను నిరుపేద కుటుంబాలకు అందించాలి. 
  5. ప్రతి కుటుంబానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 21 రోజుల వేతనం అందించాలి. ఉపాధి హామీ పథకం నిధులు రెట్టింపు చేయాలి.
  6. వైద్య ఆరోగ్య రంగానికి కనీసం 35 శాతం నిధులు కేటాయించాలి. 


‘‘కరోనా వైరస్‌ విస్తరించకుండా దేవుడి దయతో అడ్డుకోగలుగుతున్నాం. మన కంటికి కనిపించని మహమ్మారి త్వరలోనే పోతుందని నమ్ముతున్నాను. ఈ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ఒక్కటిగా ఉండాలి. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతాం’’

- ప్రధానితో సీఎం జగన్‌


Updated Date - 2020-04-12T07:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising