నిందితుల అరెస్టు
ABN, First Publish Date - 2020-12-29T05:49:02+05:30
మండలంలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన గఫార్ బేగ్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ రాజేంద్ర సోమవారం తెలిపారు
ఆళ్లగడ్డ, డిసెంబరు 28: మండలంలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన గఫార్ బేగ్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ రాజేంద్ర సోమవారం తెలిపారు, హత్య కేసులో నిందితులుగా కత్వాల్ శేఖర్ సింగ్ (ఆళ్లగడ్డ), షేక్ ఖాజాపీర్ (ప్రొద్దుటూరు), అన్నవరం పెద్దశ్రీనివాసులు (ఆళ్లగడ్డ), చంద్రశేఖర్ (దేవరాయపురం), రేష్మాలను పట్టణంలో అరెస్టు చేశామని తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదిన రాత్రి 8 గంటల సమయంలో నిందితులు గఫార్ బేగ్‌ను దారుణంగా హత్య చేశారని డిఎస్పీ వివరించారు. నిందితులపై 302, 201 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వీరిని కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి రిమాండుకు పంపిస్తామని తెలిపారు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన రూరల్ సీఐ సుదర్శన ప్రసాద్, ఎస్‌ఐ వరప్రసాద్, టౌన్ పోలీసు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.
ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేయించింది
ప్రియుడిని ప్రేరేపించి కాబోయే భర్తను హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో తెలింది. మండలంలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన మొఘల్ వలి కుమారుడు గఫార్‌బేగ్‌కు ఆళ్లగడ్డలో నివాసం ఉంటున్న స్వయాన మేనమామ కూతురుతోఈ ఏడాది జూన్‌లో వివాహ నిశ్చితార్థం జరిగింది. అప్పటికే మేనమామ కూతురు ప్రేమ వ్యవహరంలో ఉన్నట్లుగా ఇరువురి తల్లిదండ్రులకు తెలియదు. తన తోటి విద్యార్థితో ప్రేమ వ్యవహారంలో ఉన్న ఈ అమ్మాయి ప్రియుడిని ప్రేరేపించి కాబోయే భర్తను హతమార్చిందని తెలిపారు.
హత్యకేసులో నిందితులంతా విద్యార్థులే
కోటకందుకూరు గఫార్‌బేగ్ హత్య కేసులోని నిందితులంతా విద్యార్థులే. వీరిలో శ్రీనివాసులు మినహా మిగిలిన వారంతా ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రి చదువుకుంటున్నారు.
Updated Date - 2020-12-29T05:49:02+05:30 IST