నేను.. ఇంటలిజెన్స్ డీఎస్పీని..!
ABN, First Publish Date - 2020-11-03T10:12:55+05:30
‘హెలో... నేను ఇంటలిజెన్స్ డీఎస్పీని మాట్లాడుతున్నా.. రెండు రోజుల క్రితం మీ మండలంలో ఓ రైతు చనిపోయాడు కదా...
ఫోన్ చేసి ఘరానా మోసాలు
పోలీసుల అదుపులో నకిలీ
కర్నూలు, నవంబరు 2: ‘హెలో... నేను ఇంటలిజెన్స్ డీఎస్పీని మాట్లాడుతున్నా.. రెండు రోజుల క్రితం మీ మండలంలో ఓ రైతు చనిపోయాడు కదా... ఆయన కుటుంబ వివరాలు కావాలి..’ అని ఫోన్‌లో మాట్లాడతాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై.. రైతు కుటుంబంవివరాలు, ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఆ వెంటనే రైతు భార్యకు ఫోన్ కాల్ వెళుతుంది. ‘మీ ఆయన చనిపోయారు కదా.. ప్రభుత్వం నుంచి బీమా వస్తుంది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కూడా కొంత సొమ్ము వస్తుంది..’ అని ఆశపెడతాడు. ఆ మొత్తం మంజూరు కావాలంటే జీఎ్‌సటీ, సర్వీస్ ట్యాక్సు కట్టాలని బురిడీ కొట్టిస్తాడు. ఇలా చాలా మందిని మోసగించిన కిరణ్ కుమార్ అలియాస్ రవికుమార్ (34)ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ పార్థసారథిరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మిడ్తూరు మండలం కడమూరు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. వంట మాస్టారుగా పని చేస్తుండేవారు. జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో సంపాదించాలని పథకం వేశాడు. వార్తపత్రికలు, ఇంటర్నెట్ ద్వారా అసహజంగా మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తాడు. ఆత్మహత్యలు, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను టార్గెట్ చేస్తాడు. ఆ మండల తహసీల్దారుకు ఫోన్ చేసి తాను ఇంటలిజెన్స్ డీఎస్పీని అని మాట్లాడుతారు. బాధిత కుటుంబాల వివరాలు సేకరించి వారికి ఫోన్ చేసి మోసగిస్తాడు. పరిహారం మంజూరు అయిందని, కొంత మొత్తం పన్ను చెల్లిస్తే కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని నమ్మిస్తాడు. వారు ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఈ రోజే గడువు ముగుస్తుందని తొందరపెడతాడు. అప్పటికప్పుడు పరిచయం ఉన్నవారి బ్యాంకు ఖాతా, ఫోన్ పే, గూగూల్ పేల ద్వారా డబ్బు జమ చేయించుకుంటాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతుంటాడు. గోనెగండ్ల, నంద్యాల టూ టౌన్, బేతంచెర్ల, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లాలో కూడా మోసానికి పాల్పడ్డాడు. రాయచూరు, బళ్లారి, హుబ్లి, మంగళూరు, బెంగళూరు తదితర ప్రదేశాలకు వెళ్లి జల్సా చేసేవాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోనెగండ్ల ఎస్‌ఐ శరత్‌కుమార్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితుడి వివరాలు గుర్తించారు. కర్నూలులో ఉన్న తల్లి శేషమ్మను కలవడానికి వస్తుండగా అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన గోనెగండ్ల ఎస్‌ఐ శరత్‌కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు రంగారావు, బాబునాయక్, వేణుగోపాల్, రాజేంద్రగౌడును డీఎస్పీ అభినందించారు.
Updated Date - 2020-11-03T10:12:55+05:30 IST